Nitish Rana: అంపైర్‌పై అసభ్య పదజాలం.. బెంచ్‌పై ఉన్న నితీష్ రాణాకు జరిమానా!

Nitish Rana: ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు నీతీశ్‌ రాణాకు భారీ జరిమానా పడింది.

Update: 2026-04-12 11:08 GMT

Nitish Rana: అంపైర్‌పై అసభ్య పదజాలం.. బెంచ్‌పై ఉన్న నితీష్ రాణాకు జరిమానా!

Nitish Rana: ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) ఆటగాడు నీతీశ్‌ రాణాకు భారీ జరిమానా పడింది. శనివారం చెపాక్ మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫోర్త్‌ అంపైర్‌పై అసభ్య పదజాలం (ఆడిబుల్ అబ్సీనిటీ) వాడడమే కాకుండా.. వాదనకు దిగడంతో ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు అతడి డిసిప్లినరీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేసింది.

అయితే సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో నీతీశ్‌ రిజర్వ్‌ బెంచ్‌పై ఉండటం గమనార్హం. ప్లేయింగ్ 11 లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా అతడు మైదానంలోకి దిగలేదు. ఇలా బెంచ్‌పై ఉన్న ఆటగాడికి జరిమానా పడటం చాలా అరుదు. బహుశా ఐపీఎల్‌లో ఇదే మొదటిసారి కావొచ్చు.

ఇంతకీ ఏం జరిగిందంటే?.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు విజయానికి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో ట్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా ఆడుతూ 36 బంతుల్లో 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ రెండో బంతిని చెన్నై బౌలర్ ఓవర్టన్ వికెట్లకు కాస్త దూరంగా విసిరాడు. ఫీల్డ్ అంపైర్ వైడ్‌ ఇవ్వగా.. ఓవర్టన్ రివ్యూ తీసుకున్నాడు.

ఆ సమయంలోనే స్టబ్స్‌ తన గ్లవ్‌ను మార్చుకుంటానని అంపైర్‌కు చెప్పాడు. ఫోర్త్‌ అంపైర్‌ అందుకు నిరాకరించాడు. ఢిల్లీ కోచ్‌ హేమంగ్‌ బదానీ ఫోర్త్‌ అంపైర్‌తో మాట్లాడాడు. మరోవైపు డగౌట్‌లో ఉన్న నితీష్ రాణా ఫోర్త్‌ అంపైర్ అనీష్ సహస్రబుద్ధేతో వాగ్వాదానికి దిగాడు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బదానీ కలగజేసుకోవడంతో నితీష్ వెనక్కి తగ్గాడు.

ఫోర్త్ అంపైర్‌తో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన కారణంగా నీతీశ్‌ రాణాపై ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. కారిఫరీ నిర్ణయం మేరకు రాణాకు భారీ జరిమానా, ఓ డిమెరిట్ డీమెరిట్ ఖాతాలో చేరింది. మరోవైపు స్టబ్స్‌ ఔటైన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి తన హెల్మెట్‌ను విసిరికొట్టాడు. దీనిపై కూడా స్టబ్స్‌కు జరిమానా పడే అవకాశం ఉంది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనపై రూ.12 లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్‌లో ఇది సీఎస్‌కేకు మొదటి స్లో ఓవర్ రేట్ తప్పిదం. ఈ సీజన్‌లో ఇప్పటికే గిల్ (గుజరాత్ టైటాన్స్), శ్రేయాస్ (పంజాబ్ కింగ్స్) కూడా జరిమానాలు ఎదుర్కొన్నారు. అయ్యర్ ఈ సీజన్‌లో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. మ్యాచ్‌లో ఢిల్లీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Tags:    

Similar News