RR vs RCB: వైభవ్‌ సూర్యవంశీ గార్డియన్‌ భిందర్‌పై బీసీసీఐ ఫైర్, చర్యలకు సిద్ధం!

RR vs RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో వివాదం తలెత్తింది. యాంటీ-కరప్షన్ నిబంధనలను ఆర్‌ఆర్ జట్టు మేనేజర్ ఉల్లంఘించారు.

Update: 2026-04-12 11:36 GMT

RR vs RCB: వైభవ్‌ సూర్యవంశీ గార్డియన్‌ భిందర్‌పై బీసీసీఐ ఫైర్, చర్యలకు సిద్ధం!

RR vs RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో వివాదం తలెత్తింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య శుక్రవారం గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో యాంటీ-కరప్షన్ నిబంధనలను ఆర్‌ఆర్ జట్టు మేనేజర్, యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ గార్డియన్‌ రోమీ భిందర్‌ ఉల్లంఘించారు.

ఆర్‌ఆర్, ఆర్‌సీబీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోమీ డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆయన పక్కనే వైభవ్‌ కూడా ఉన్నాడు. ఈ వీడియో మొదట సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆ తరువాత ఇది నిజమని బీసీసీఐ ధృవీకరించింది.

ఈ ఘటనపై బీసీసీఐ స్పందించింది. 'ప్లేయర్స్, మ్యాచ్ ఆఫిషియల్స్ ఏరియా (పీఎంఓఏ)లో సెల్‌ఫోన్ వాడకం నిషేధం. డగౌట్‌లో ఫోన్ ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. రోమీ భిందర్‌ మాత్రం నిబంధనలను ఉల్లంఘించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ ఉపయోగించాలి.

డగౌట్‌లో ఫోన్ అస్సలు ఉపయోగించకూడదు. ఇది అనుకోకుండా జరిగినా చర్య తప్పదు. హెచ్చరిక లేదా మ్యాచ్ నిషేధం వంటి శిక్షలు ఉండొచ్చు. మ్యాచ్ రిఫరీ, యాంటీ-కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు' అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ కూడా స్పందించారు. డగౌట్ వంటి హై సెక్యూరిటీ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. మ్యాచ్‌పై ఎలాంటి బాహ్య ప్రభావం లేకుండా ఉండేందుకు పీఎంఓఏ ప్రాంతంలో కఠిన నియమాలు అమలు చేస్తారన్నారు. రోమీ భిందర్‌పై తప్పక చర్యలు తీసుకోవాలని లలిత్ మోడీ డిమాండ్ చేశారు.

ఇప్పటికే ఈ వ్యవహారం బీసీసీఐ యాంటీ-కరప్షన్ యూనిట్ దృష్టికి వెళ్లింది. విచారణ అనంతరం నివేదిక సమర్పిస్తారు. నివేదిక ఆధారంగా రోమీ భిందర్‌పై భారీ జరిమానా లేదా తాత్కాలిక సస్పెన్షన్ పడనుంది. తాజాగా రోమీ భిందర్‌ను తన లోకల్ గార్డియన్‌గా వైభవ్ అభివర్ణించాడు. దీంతో ఆయనపై కెమెరా ఫోకస్ పెట్టగా.. ఫోన్‌ వాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. భిందర్‌ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ.. చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

Tags:    

Similar News