Asia Cup 2025 : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్.. ఆసియా కప్ జట్టులో ఈ ఆటగాళ్ల ప్లేస్‌పై క్లారిటీ
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.
Asia Cup 2025 : అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్‌మన్ గిల్.. ఆసియా కప్ జట్టులో ఈ ఆటగాళ్ల ప్లేస్‌పై క్లారిటీ
Asia Cup 2025: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయితే, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆగస్టు 19 లేదా 20న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జట్టును ప్రకటించిన తర్వాత, ఏయే ఆటగాళ్లకు చోటు దక్కుతుంది? భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండనుంది? టాప్ ఆర్డర్‌లో ఎవరు ఆడుతారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది.
బీసీసీఐ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. సెలెక్టర్లు జట్టులో పెద్దగా మార్పులు చేసే ఆలోచనలో లేరు. దీనికి కారణం, ప్రస్తుతం టాప్ 5లో ఉన్న ఆటగాళ్లు ఇప్పటికే చాలా బలంగా ఉన్నారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటివారు ఈ జాబితాలో ఉన్నారు.
అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్. అలాగే, సంజు శాంసన్ గత సీజన్‌లో బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వీరితో పాటు, శుభ్‌మన్ గిల్ ను కూడా జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. గిల్ ఇటీవలి ఫామ్, ఐపీఎల్‌లో అతని ప్రదర్శనను బట్టి, అతన్ని వదిలిపెట్టలేమని ఆ వర్గాలు తెలిపాయి. అయితే, టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే చాలా మంది మంచి ఆటగాళ్లు ఉండటంతో, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి ఆటగాళ్లకు చోటు కల్పించడం సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారనుంది.
జట్టులో ప్రధాన పేస్ ఆల్-రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. అతనికి బ్యాకప్‌గా శివమ్ దూబేను ఆసియా కప్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన శివమ్ దూబే, ఇంగ్లాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో మంచి ప్రదర్శన చేసి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉంటే అతడే ఆసియా కప్ కెప్టెన్‌గా కొనసాగడం ఖాయం. అయితే, వైస్-కెప్టెన్సీ విషయంలో మాత్రం అక్షర్ పటేల్ మరియు శుభ్‌మన్ గిల్ మధ్య పోటీ ఉంది. శుభ్‌మన్ గిల్ ఆసియా కప్ జట్టులో చోటు సంపాదిస్తే, అతనికి వైస్-కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. గత టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో అక్షర్ పటేల్ ఈ బాధ్యతను నిర్వర్తించాడు.