Vikram Misri: పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం దుర్మార్గం.. భారత సైన్యానికి పూర్తి స్వేచ్చ
Vikram Misri: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. శనివారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం అన్నారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. కొన్నిగంటలుగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని..ఇది అత్యంత దుర్మార్గమని ఘాటుగా స్పందించారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్ దేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబు ఇస్తుందన్నారు. పాకిస్తాన్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలకు పాకిస్తాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లు విక్రమ్ మిస్రీ తెలిపారు.
పాకిస్తాన్ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని, ఈ ఆక్రమణను ఆపడానికి వెంటనే తగిన చర్య తీసుకోవాలని మేము విశ్వసిస్తున్నాము. సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఏదైనా ఆక్రమణను ఎదుర్కోవడానికి నిర్దిష్టమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం" అని విదేశాంగ కార్యదర్శి అన్నారు.ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్, భారతదేశం మధ్య సాయంత్రం 5 గంటలకు పరస్పర ఒప్పందం కుదిరింది. కానీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పాటించలేదు. చాలా చోట్ల కాల్పులు జరిపి డ్రోన్లను పంపింది. దీనికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి, భారత విదేశాంగ కార్యదర్శి ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించి, దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాలని అన్నారు.