Galwan Valley Clash: డ్రాగన్ బరితెగింపునకు ఏడాది.. మరువలేనివి సైనికుల త్యాగాలు

Galwan Valley Clash: 2020 జూన్ 15... ప్రశాంతంగా ఉండే గల్వాన్‌ లోయలో రక్తపాతం జరిగిన రోజు.

Update: 2021-06-15 10:27 GMT

కర్నల్ సంతోష్​ బాబు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Galwan Valley Clash: 2020 జూన్ 15... ప్రశాంతంగా ఉండే గల్వాన్‌ లోయలో రక్తపాతం జరిగిన రోజు. విస్తరణ కాంక్షతో మదమెక్కిన డ్రాగన్ బరితెగింపునకు దిగిన రోజు. చైనా సైనికులతో భారత జవాన్లు వీరోచితంగా పోరాడిన రోజు. భారత సైన్యంలో 20 మంది కొదమ సింహాలు అసువులు బాసిన రోజు. చైనా-భారత్ సరిహద్దు ప్రాంతమైన తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్‌ లోయలో ఇరు దేశాల సైనికుల పరస్పర ఘర్షణలకు ఏడాది పూర్తయింది. 2020 జూన్‌ 15న జరిగిన ఈ ఘర్షణలల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్​ బాబు సహా.. 20 మంది సైనికులు వీరమరణం పొందారు.

నాడు డ్రాగన్ దురాగతాన్ని ఎదిరిస్తూ తెలుగు యోధుడు కర్నల్ సంతోష్​ బాబు నేతృత్వంలోని భారత సైనికులు చూపిన తెగువ, చేసిన బలిదానాన్ని ఈ సందర్భంగా దేశం స్మరించుకుంటుంది. సంతోష్‌ బాబు మరణం ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుమారుడిని పోగొట్టుకోవడం తల్లిదండ్రులకు మాయని గాయమే అయినా దేశం కోసం పోరాడి ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకున్నాడు కర్నల్‌ సంతోష్‌బాబు.

చైనా దాష్టీకానికి ఎదురు నిలబడి డ్రాగన్‌ సైనికులతో పోరాడి అసువులు బాసిన కర్నల్‌ సంతోష్‌ బాబు ఏడాదైనా ప్రజల గుండెల్లో మెదులుతూనే ఉన్నాడు. సూర్యాపేటకు చెందిన సంతోశ్‌బాబు చిన్ననాటి నుంచే తండ్రి ప్రోత్సాహంతో సైన్యంలో చేరడమే లక్ష్యంగా చదివాడు. కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. ఆ తర్వాత ఇండియన్‌ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణపూర్తి చేసుకుని ఆర్మీ విధుల్లో చేరారు. 15 ఏళ్ల సర్వీసులో దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేశాడు. 2007లో పాకిస్థాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశ రక్షణలో భాగస్వామ్యమయ్యాడు. 2020 జూన్‌ 15 తెల్లవారు జామున రెచ్చిపోయి తెగబడిన చైనా సైనికులకు కొదమసింహంలా ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందాడు.

శత్రు సైనికులకు ఎదురొడ్డి పోరాడిన సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వం ఆయన కుటుంబానికి గౌరవనీయమైన స్థాయిలో ఆర్ధిక సహకారం అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వారిని పరామర్శించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహం ఏర్పాటు చేసి సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. సంతోష్‌బాబు వీరమరణం పొందేనాటికి ఆయనకు భార్య సంతోషి, తొమ్మిదేళ్ల కుమార్తె అభిజ్ఞ, నాలుగేళ్ల కుమారుడు అనిరుధ్ ఉన్నారు. కర్నల్‌ మరణంతో ఆయన భార్యపై ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికి శిక్షణలో ఉన్న సంతోషి భర్త జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

అతిపెద్ద ఈ సైనిక ఘర్షణతో ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. భారీగా బలగాలు, ఆయుధాలను సరిహద్దుల్లోకి తరలించాయి. గల్వాన్ ఘర్షణల్లో తమ సైనికులు ఐదుగురు చనిపోయినట్లు చాలా రోజుల తర్వాత చైనా మొదటిసారిగా అంగీకరించింది. ఆతర్వాత అప్పటి నుంచి అనేక విడతలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు.

Tags:    

Similar News