Sukhoi-30 Crash: సుఖోయ్ ప్రమాదంలో 'ఆపరేషన్ సిందూర్' హీరో వీరమరణం
Sukhoi-30 Crash: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో దేశం ఒక ధీశాలిని కోల్పోయింది.
Sukhoi-30 Crash: సుఖోయ్ ప్రమాదంలో 'ఆపరేషన్ సిందూర్' హీరో వీరమరణం
Sukhoi-30 Crash: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 MKI యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో దేశం ఒక ధీశాలిని కోల్పోయింది. అస్సాంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ (28), స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరణించిన పైలట్లలో ఒకరైన పూర్వేశ్.. గతేడాది పాకిస్థాన్‌పై భారత బలగాలు నిర్వహించిన అత్యంత రహస్య పోరాటం 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) లో పాలుపంచుకోవడం విశేషం.
ఆపరేషన్ ముగిశాకే ఇంటికి సమాచారం
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన పూర్వేశ్, వాయుసేనలో యుద్ధ విమానాలు నడపడాన్ని గర్వంగా భావించేవారని ఆయన తండ్రి రవీంద్ర గుర్తు చేసుకున్నారు. "గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో 15 రోజుల పాటు మా కుమారుడు మాతో టచ్‌లో లేడు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తర్వాతే తను అందులో పాల్గొన్న విషయం మాకు తెలిసింది. దేశం కోసం సుదీర్ఘ కాలం సేవ చేయాలనుకున్నాడు.. కానీ ఆ కల తీరకముందే అనంతలోకాలకు వెళ్లిపోయాడు" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
పది రోజుల క్రితమే గెట్-టు-గెదర్
విధుల నిమిత్తం అస్సాం వెళ్లడానికి పది రోజుల ముందే పూర్వేశ్ తన స్వస్థలమైన నాగ్‌పుర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు. బుధవారం కూడా ఫోన్లో మాట్లాడిన పూర్వేశ్, గురువారం విధుల్లో చేరారు. శిక్షణలో భాగంగా జొర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. ఎయిర్‌బేస్‌కు 60 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలినట్లు వాయుసేన అధికారులు ధృవీకరించారు.
దేశానికి స్ఫూర్తిగా పూర్వేశ్
28 ఏళ్లకే దేశ రక్షణలో ప్రాణాలర్పించిన పూర్వేశ్, యువతకు ఒక స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన కుటుంబం పేర్కొంది. సుఖోయ్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాన్ని నడపడంలో ఆయన ఎంతో నైపుణ్యం కలిగిన వారైనప్పటికీ, సాంకేతిక లోపమా లేక ఇతర కారణాలా అన్న కోణంలో వాయుసేన విచారణ జరుపుతోంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ ఇద్దరు పైలట్ల త్యాగానికి యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది.