Snakes in AC: ఏసీలో ఐదు పాములు.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని షాక్!
Snakes in AC: ఏసీ ఆన్ చేసి హాయిగా నిద్రపోదామని అనుకున్న ఆ యువకుడికి వెన్నులో వణుకు పుట్టే దృశ్యం కనిపించింది.
Snakes in AC: ఏసీలో ఐదు పాములు.. బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని షాక్!
Snakes in AC: ఏసీ ఆన్ చేసి హాయిగా నిద్రపోదామని అనుకున్న ఆ యువకుడికి వెన్నులో వణుకు పుట్టే దృశ్యం కనిపించింది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
శ్రీకార్యంకు చెందిన మాధవ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అలసటగా ఉండటంతో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఏసీ ఆన్ చేయబోతుండగా.. ఏసీ కింద భాగంలో ఏదో కదులుతున్నట్లు గమనించాడు. అనుమానంతో దగ్గరకు వెళ్లి పరిశీలించగా, వింత శబ్దాలు వినిపించాయి. లోపల పాము ఉందనే భయంతో ఆయన వెంటనే అప్రమత్తమై.. కేరళ అటవీశాఖకు చెందిన సర్ప (SARPA) యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించాడు.
గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్:
అటవీశాఖ పంపిన స్నేక్ క్యాచర్, ఒక ఏసీ టెక్నీషియన్‌తో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఏసీ ప్యానెల్‌ను జాగ్రత్తగా విప్పి చూడగా, అందులో ఏకంగా ఐదు పాములు ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించిన రెస్క్యూ టీమ్.. నాలుగు పాములను సురక్షితంగా బయటకు తీశారు. ఐదవ పాము పైపు మార్గం ద్వారా బయటకు తప్పించుకుంది.
ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు:
బయటపడిన పాములు విషపూరితమైనవి కావని అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో మాధవ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మల ద్వారా లేదా ఏసీ డ్రైనేజీ పైపు మార్గం గుండా ఈ పాములు లోపలికి ప్రవేశించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలం లేదా చల్లని వాతావరణంలో పాములు వెచ్చదనం కోసం ఇలాంటి ప్రదేశాలను వెతుక్కుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.