కరోనాతో రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు : భారత వైద్య పరిశోధన మండలి

Update: 2020-06-16 07:01 GMT

కరోనాతో ముందుంది మొసళ్ల పండుగ అని భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తోంది. దేశంలో నవంబర్ నాటికి మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, అప్పుడు ఐసీయూ, వెంటిలేటర్ల కొరత ఏర్పడవచ్చని అంచనా వేసింది. లాక్ డౌన్ తో కాస్త నెమ్మదించిన వైరస్ సడలింపులతో మళ్లీ ఊపందుకుంటుంది అని తెలిపింది.

యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి భారత్‌లో నవంబర్‌ మధ్య నాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. అప్పుడు ఐసీయూ పడకలు, వెంటిలేటర్ల కొరత ఏర్పడొచ్చని అంచనా వేసింది. 8 వారాల లాక్‌డౌన్‌ వల్ల కరోనా గరిష్ఠస్థాయిని చేరుకోవడం కొద్దికాలం పాటు వాయిదా పడిందని తెలిపింది. అదే సమయంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాల మెరుగుకు లాక్‌డౌన్‌ ఉపయోగపడిందని తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ రీసెర్చి గ్రూప్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ వల్ల కరోనా గరిష్ఠ స్థాయిని చేరుకోవడం సుమారు 34 నుంచి 76 రోజుల పాటు వాయిదా పడిందని పరిశోధకులు తేల్చారు. 69 నుంచి 97 శాతం ఇన్ఫెక్షన్‌ రేటును తగ్గించడానికి కారణమైందని అధ్యయనంలో తేలింది. లాక్‌డౌన్‌ తర్వాత సుమారు 60 శాతం మేర ప్రజారోగ్య వ్యవస్థ పటిష్ఠమైందని తెలిపింది. ఈ ప్రజారోగ్య చర్యలు నవంబర్‌ మొదటి వారం వరకు డిమాండ్‌ను అందుకుంటాయని, అనంతరం కొరత ఏర్పడొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

నవంబర్ లో వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఐసోలేషన్‌ పడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు డిమాండ్ కు తగ్గట్లు కొద్ది నెలల పాటు సరిపోకపోవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించకపోయి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకపోయి ఉంటే ఎదురయ్యే డిమాండ్‌తో పోలిస్తే ఇది 83 శాతం తక్కేవేనని తెలిపారు. అదే సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను 80 శాతం మేర పెంచి ఉంటే ఈ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలయ్యేదని అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ మహమ్మారి కోసం ప్రజారోగ్య వ్యవస్థపై వెచ్చించే మొత్తం జీడీపీలో 6.2 శాతం ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు.

దేశంలో జూన్‌ 9 నాటికి 958 కొవిడ్‌-19 ఆస్పత్రుల్లో 1,67,883 ఐసోలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అలాగే 21,614 ఐసీయూ, 73,469 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఇవి కాకుండా 2,313 కొవిడ్‌ హెల్త్‌ సెంటర్లలో 1,33,037 ఐసోలేషన్‌, 10,748 ఐసీయూ, 46,635 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. ఇవికాక 7,525 కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 7,10,642 పడకలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 21,494 వెంటిలేటర్లు ఉన్నాయని, మరో 60,848 వెంటిలేటర్లకు ఆర్డర్‌ చేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Tags:    

Similar News