Kerala: చిల్లర పోగేసి లాటరీ టికెట్‌ కొంటే.. రూ.10 కోట్ల జాక్‌పాట్‌

Kerala: గతేడాది కొన్న టికెట్‌కు రూ7,500 వచ్చాయంటున్న కార్మికులు

Update: 2023-07-29 03:50 GMT

Kerala: చిల్లర పోగేసి లాటరీ టికెట్‌ కొంటే.. రూ.10 కోట్ల జాక్‌పాట్‌

Kerala: కేరళలోని పరప్పనంగడి మున్సిపల్‌ కొర్పొరేషన్‌ కార్మికుల అదృష్టం వరించింది. 250 రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్‌‌తో ఏకంగా 10 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్‌ కొనేందుకు నానా హైరానా పడిన ఈ మహిళలు ఎన్నడూ ఊహించని విధంగా జాక్‌పాట్‌ కొట్టేశారు. కేరళ లాటరీ విభాగం ప్రకటించిన వర్షాకాల ఫలితాల్లో వీరు కొనుగోలు చేసిన టికెట్‌ ఒకటీ రెండూ కాదు... ఏకంగా రూ.10 కోట్లు గెలుచుకుంది. కేరళలోని పరప్పనంగడి మున్సిపల్‌ కొర్పొరేషన్‌లో 11 మంది మహిళా సభ్యులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేస్తుంటారు. వీరు తలా 25 రూపాయల కంటే తక్కువగా పోగేయగా జమయిన 250 పెట్టి ఇటీవల కేరళ లాటరీ టికెట్‌ కొనుగోలు చేశారు.

బుధవారం ప్రకటించిన ఫలితాల్లో హరిత కర్మ సేన కొనుగోలు చేసిన టికెట్‌ 10 కోట్ల జాక్‌పాట్‌ వరించింది. దీంతో, వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గత ఏడాది కూడా ఓనమ్‌ పండుగ సందర్భంగా తలాకొంత పోగేసి కొన్న టికెట్‌కు 7వేల 5వందలు రాగా అందరం సమానంగా పంచుకున్నామని చెప్పారు. అదే ధైర్యంతో ఈసారి కొన్న టికెట్‌కు ఏకంగా 10 కోట్లు వస్తాయని ఊహించలేదన్నారు. ఈ డబ్బును అందరం సమంగా పంచుకుంటామని తెలిపారు. అప్పులు తీర్చుకుని, పిల్లల పెళ్లిళ్లు చేస్తామని, కుటుంబసభ్యులకు అవసరమైన వైద్యం చేయించుకుంటామని చెబుతున్నారు.

Tags:    

Similar News