World Mosquito Day: ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం.. ఈ రోజు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

World Mosquito Day: దోమలు చూడటానికి చిన్నవిగా ఉన్నా, మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే కెపాసిటీ వీటికి ఉంది. అవును, దోమలు చాలా ప్రమాదకరమైనవి.

Update: 2025-08-20 06:30 GMT

World Mosquito Day: దోమలు చూడటానికి చిన్నవిగా ఉన్నా, మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే కెపాసిటీ వీటికి ఉంది. అవును, దోమలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షల మరణాలకు కారణమవుతున్నాయి. ఈ పరాన్నజీవులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. ఇలాంటి వ్యాధుల బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మలేరియా, దోమల వల్ల సంభవించే ఇతర వ్యాధులను నివారించడంపై ప్రజలలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచ దోమల దినోత్సవాన్ని 1930లో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రారంభించింది. దీని వెనుక ఒక కారణం ఉంది. 1897 ఆగస్టు 20న బ్రిటిష్ వైద్యుడు రొనాల్డ్ రాస్ దోమలు, వాటి ద్వారా వ్యాపించే వ్యాధులపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో ఆడ అనోఫిలస్ దోమ కాటు వల్ల మనుషులకు మలేరియా వ్యాపిస్తుందని ఆయన కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మలేరియా వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి చాలా సహాయపడింది. ఈ ముఖ్యమైన ఆవిష్కరణ కోసం సర్‌ రొనాల్డ్‌కు వైద్య రంగంలో నోబెల్ బహుమతి కూడా లభించింది. సర్‌ రొనాల్డ్, అతని బృందం చేసిన ఈ అద్భుతమైన పరిశోధనను గుర్తించడానికి, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఈ ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ రోజున దోమల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధులు మరియు వాటి నివారణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు.

ప్రపంచ దోమల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం.. దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులపై అవగాహన కల్పించడం. వైద్య సౌకర్యాలు ఎంతగా అభివృద్ధి చెందినా, మలేరియా వంటి వ్యాధులు నేటికీ మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. అందుకే దోమల సంఖ్యను నియంత్రించడం, వివిధ రకాల దోమల గురించి, వాటి కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ఈ రోజున నిర్వహిస్తారు.

దోమల గురించి ఆసక్తికరమైన విషయాలు

ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో 3,000 కంటే ఎక్కువ జాతుల దోమలు ఉన్నాయి. ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఎందుకంటే వాటికి గుడ్లు పెట్టడానికి రక్తం నుంచి ప్రోటీన్లు అవసరం. రక్తం తాగిన తర్వాత, ఆడ దోమలు తమ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి చీకటి ప్రదేశాలను వెతుకుతాయి. అందుకే దోమలు నల్లని దుస్తులు ధరించిన వారిపై ఎక్కువగా వాలుతాయి. శరీర ఉష్ణోగ్రత, వాసన, మనుషులు, జంతువులు శ్వాస తీసుకున్నప్పుడు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్, చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ వంటి వాటికి దోమలు ఆకర్షితులవుతాయి. మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్‌ను దోమలు సుమారు 60 నుండి 75 అడుగుల దూరం నుంచి గుర్తించగలవు.

Tags:    

Similar News