healthy breakfast: సంపూర్ణ ఆరోగ్యం కోసం కేరళ స్టైల్ పుట్టు.. దీని ప్రయోజనాలు తెలిస్తే వదలరు!

కేరళలోని ప్రతి ఇంట్లోనూ నిత్యం ఘుమఘుమలాడే సంప్రదాయ వంటకం 'పుట్టు'. ఆవిరిపై ఉడికించే ఈ వంటకానికి తోడుగా స్పైసీగా ఉండే 'కడల కర్రీ' (నల్ల శెనగల కూర) తోడైతే ఆ రుచే వేరుగా ఉంటుంది.

Update: 2026-02-09 13:30 GMT

healthy breakfast: సంపూర్ణ ఆరోగ్యం కోసం కేరళ స్టైల్ పుట్టు.. దీని ప్రయోజనాలు తెలిస్తే వదలరు!

అది కేవలం అల్పాహారం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం! కేరళలోని ప్రతి ఇంట్లోనూ నిత్యం ఘుమఘుమలాడే సంప్రదాయ వంటకం 'పుట్టు'. ఆవిరిపై ఉడికించే ఈ వంటకానికి తోడుగా స్పైసీగా ఉండే 'కడల కర్రీ' (నల్ల శెనగల కూర) తోడైతే ఆ రుచే వేరుగా ఉంటుంది. తక్కువ నూనెతో, సమతుల్య పోషకాలతో నిండిన ఈ కేరళ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌ను మన ఇంట్లోనే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసినవి:

కడల కర్రీ కోసం: నల్ల శెనగలు (1 కప్పు), పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొబ్బరి పాలు, కరివేపాకు, మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు).

పుట్టు కోసం: పుట్టు పొడి (బియ్యపు పిండి రకం), పచ్చి కొబ్బరి తురుము, తగినంత ఉప్పు.

తయారీ విధానం:

ముందుగా కడల కర్రీ: రాత్రంతా నానబెట్టిన శెనగలను కుక్కర్‌లో వేసి, తగినంత నీరు, పసుపు, ఉప్పు కలిపి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. శెనగలు మరీ మెత్తగా అవ్వకుండా జాగ్రత్తపడాలి. పాన్‌లో మసాలా దినుసులను వేయించి, పొడి చేసుకున్నాక.. అందులో పచ్చి కొబ్బరి, కారం, పసుపు, ఉడికించిన కొన్ని శెనగలను వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలను ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మగ్గించాలి. మగ్గిన మిశ్రమంలో గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, ఉడికించిన శెనగలు (నీటితో సహా) వేసి ఉడికించాలి. చివరగా కొబ్బరి పాలు, కరివేపాకు వేసి దించేస్తే నోరూరించే కడల కర్రీ సిద్ధం అవుతుంది.

ఆవిరిపై పుట్టు: పుట్టు పొడిలో (బియ్యపు పిండి రకం) కొద్దిగా ఉప్పు వేసి, నీటిని చిలకరిస్తూ తడపాలి. పిండి ముద్దలా కాకుండా, చేత్తో పట్టుకుంటే ఉండకట్టి.. వదిలితే పొడి అయ్యేలా ఉండాలే చూసుకోవాలి. పుట్టు మేకర్‌లో మొదట కొబ్బరి తురుము, తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని లేయర్లుగా నింపాలి. పిండిని గట్టిగా నొక్కకుండా తేలికగా వేయాలి. పుట్టు మేకర్‌ను ఆవిరిపై ఉంచి 10-15 నిమిషాల పాటు ఉడికిస్తే, గుమగుమలాడే పుట్టు సిద్ధమవుతుంది. ఈ అల్పాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే శెనగలు, ఆవిరిపై ఉడికించిన బియ్యపు పిండి ఉండటం వల్ల ఇది సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీకెండ్‌లో కేరళ రుచులను మీ ఇంట్లోనే ఆస్వాదించడానికి ట్రై చేయండి..

Tags:    

Similar News