Type2Diabetes : జీన్స్‌లో డయాబెటిస్ ఉన్నా.. మీ లైఫ్‌స్టైల్‌తో దాన్ని ఓడించవచ్చు! నిపుణుల సలహాలివే..
కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉందా? వంశపారంపర్యంగా వచ్చే టైప్-2 డయాబెటిస్‌ను జీవనశైలి మార్పుల ద్వారా ఎలా అడ్డుకోవచ్చో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
Type2Diabetes : జీన్స్‌లో డయాబెటిస్ ఉన్నా.. మీ లైఫ్‌స్టైల్‌తో దాన్ని ఓడించవచ్చు! నిపుణుల సలహాలివే..
Type2Diabetes : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని పీడిస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య 'టైప్-2 డయాబెటిస్'. మన శరీరం చక్కెరను (గ్లూకోజ్) వినియోగించుకునే తీరులో మార్పు రావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పితే.. కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు పోవడం, గుండె జబ్బుల వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులకు లేదా తోడబుట్టిన వారికి షుగర్ వ్యాధి ఉంటే, మనకు కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే, వంశపారంపర్యంగా వచ్చే ముప్పు ఉన్నప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీ ప్రస్తుత బరువులో కేవలం 5% నుంచి 7% తగ్గినా.. టైప్-2 డయాబెటిస్ ముప్పును 60% వరకు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు 'ఇన్సులిన్ రెసిస్టెన్స్'కు ప్రధాన కారణం. కాబట్టి, చిన్న చిన్న మార్పులతో స్థిరంగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, పొట్టు తీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని, పీచు పదార్థం శరీరం చక్కెర వినియోగాన్ని నెమ్మదింపజేస్తుందని చెప్పారు. అలాగే మీ భోజన ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు, పావు వంతు ప్రోటీన్ (చేపలు, పప్పులు), మిగిలిన పావు వంతు తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, పండ్ల రసాలకు బదులుగా నీరు లేదా హెర్బల్ టీ తాగాలని చెప్పారు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం (వేగంగా నడవడం వంటివి) చేయాలన్నారు. వారానికి రెండుసార్లు బరువులు ఎత్తడం లేదా స్క్వాట్స్ వంటి రెసిస్టెన్స్ వ్యాయామాలు చేయడం వల్ల కండరాల్లో ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుందని చెప్పారు. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, 35 ఏళ్లు దాటినప్పటి నుంచి Fasting Blood Glucose, HbA1c పరీక్షలు చేయించుకోవాలన్నారు. దీనివల్ల 'ప్రీ-డయాబెటిస్' (వ్యాధి రాకముందు దశ) దశలోనే గుర్తించి జీవనశైలి మార్పుల ద్వారా దాన్ని తిప్పికొట్టవచ్చని అన్నారు.
రోజుకు 7-9 గంటల గాఢ నిద్ర అవసరం అని, నిద్ర లేకపోతే ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లు దెబ్బతింటాయని చెప్పారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో 'కార్టిసాల్' స్థాయిలు పెరిగి చక్కెర స్థాయిలను పెంచుతాయని వెల్లడించారు. యోగా, ధ్యానం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. స్మోకింగ్ చేసేవారికి షుగర్ వచ్చే అవకాశం 30-40% ఎక్కువగా ఉంటుందని చెప్పారు. నికోటిన్ ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. షుగర్ వ్యాధిలో జీన్స్ (Genes) కీలక పాత్ర పోషించినప్పటికీ.. అధిక బరువు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, PCOD వంటి సమస్యలు డయాబెటిస్ ముప్పును పెంచుతాయని వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవడం ద్వారా వంశపారంపర్యంగా వచ్చే షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచించారు.