Heart Health : ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి! లేదంటే ప్రాణాలకు రిస్క్..
గుండె సంబంధిత సమస్యలను ప్రారంభంలోనే గుర్తించడం ఎలా? తరచుగా వచ్చే అలసట, ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.
Heart Health : ఈ 5 లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి! లేదంటే ప్రాణాలకు రిస్క్..
Heart Health : మన శరీరానికి గుండె ఇంజిన్ లాంటిది. ఇది నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తూ మనల్ని ప్రాణాలతో ఉండేలా చేస్తుంది. అయితే, గుండెకు రక్తాన్ని అందించే ధమనుల్లో పూడికలు ఏర్పడినా లేదా గుండె విద్యుత్ వ్యవస్థలో అంతరాయం కలిగినా దానిని 'హార్ట్ బ్లాక్' అంటారు. చాలా మంది దీని ప్రారంభ లక్షణాలను కేవలం పని ఒత్తిడి లేదా అలసటగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, ఆ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకమైన హార్ట్ ఎటాక్‌కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ హార్ట్ బ్లాక్ లక్షణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రధాన లక్షణాలు ఇవే..
గుండె బ్లాకేజీకి సంబంధించి మొదటి, అత్యంత సాధారణ లక్షణం ఛాతీలో అసౌకర్యం. గుండె కండరాలకు ఆక్సిజన్ కలిగిన రక్తం సరిగ్గా అందనప్పుడు ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు బరువుగా, బిగుతుగా అనిపిస్తుంది. దీనిని చాలా మంది ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యగా పొరబడతారు. కానీ నొప్పి తగ్గకుండా పదే పదే ఈ సమస్య వస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి శ్రమతో కూడిన పనులు చేయకపోయినా ఎప్పుడూ నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంటే అది గుండె సమస్యకు సంకేతం కావచ్చని అంటున్నారు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు అవయవాలకు శక్తి అందక శరీరం త్వరగా అలసిపోతుందన్నారు.
కొద్ది దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా ఆయాసం రావడం, ఊపిరి అందకపోవడం వంటివి జరుగుతుంటే మీ గుండె ఒత్తిడికి గురవుతుందని అర్థం అని చెప్పారు. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ అందక ఈ సమస్య తలెత్తుతుందన్నారు. మెదడుకు రక్త సరఫరా, ఆక్సిజన్ తగ్గితే అకస్మాత్తుగా తల తిరగడం జరుగుతుందని, తీవ్రమైన సందర్భాల్లో మనిషి స్పృహ తప్పి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. గుండె లయ తప్పి కొట్టుకుంటున్నప్పుడు ఇలా జరుగుతుందని వివరించారు. గుండె వేగం అకస్మాత్తుగా పెరగడం లేదా లయ తప్పి కొట్టుకోవడం కూడా హార్ట్ బ్లాక్‌కు సంకేతం కావచ్చన్నారు. దీనినే గుండె దడ అంటారు. దీంతో పాటు వికారం, వేగంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని చెప్పారు. ఈ లక్షణాలు కొందరిలో క్రమంగా, మరికొందరిలో అకస్మాత్తుగా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్‌ను కలిసి ECG లేదా ఇతర పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడుతుందని నిపుణులు సూచించారు.