Health Tips: రక్తహీనత వేధిస్తుందా? అమ్మమ్మల కాలం నాటి రాగి తోపను ట్రై చేయండి!
రక్తహీనతను తగ్గించేందుకు ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్న రాగి తోపను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి? పూర్తి విధానం, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి.
రక్తహీనత వేధిస్తుందా? అమ్మమ్మల కాలం నాటి రాగి తోపను ట్రై చేయండి!
ఆధునిక ఆహారపు అలవాట్ల మధ్య మనం మన అమ్మమ్మల కాలం నాటి బలమైన వంటకాలను మర్చిపోతున్నాం. అలాంటి ఒక అద్భుతమైన, సాంప్రదాయక వంటకమే 'రాగి తోప'. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సూపర్ హెల్తీ ఫుడ్ రాగి తోప. చక్కెరతో చేసే స్వీట్లకు బదులుగా, బెల్లంతో కలిపి చేసే ఈ రాగి తోప బలానికి బలం, రుచికి రుచి అందిస్తుంది. శరీరానికి చలువ చేయడమే కాకుండా, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా లభించే ఈ వంటకాన్ని సులభంగా, తక్కువ సమయంలోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి - 1 కప్పు
తురిమిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 3 నుండి 5 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు (ఆప్షనల్)
యాలకుల పొడి - అర టీస్పూన్
నీళ్లు - 2 నుంచి 2.5 కప్పులు
తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లానికి రెండున్నర కప్పుల నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2-3 స్పూన్ల నెయ్యి వేసి, ఒక కప్పు రాగి పిండిని కమ్మటి వాసన వచ్చే వరకు సన్నటి సెగ మీద వేయించాలి. రుచి మరింత పెరగాలంటే ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు వేయించిన పిండిలో బెల్లం నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా విస్కర్ లేదా గరిటతో కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గర పడే వరకు సిమ్ లోనే ఉడికించాలి. మధ్యమధ్యలో కొంచెం నెయ్యి వేస్తూ కలిపితే టేస్ట్ బాగుంటుంది. మిశ్రమం పాన్ నుంచి వేరుపడుతున్నప్పుడు యాలకుల పొడి చల్లి స్టవ్ ఆపేయాలి.
ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:
* ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది.
* క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు ఉక్కులా మారుతాయి.
* ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఇది ఉత్తమ ఆహారంగా పని చేస్తుంది.
* ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే చేసుకునే ఈ రాగి తోపను కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.