Panic Buying: అవసరం లేని వస్తువులను కూడా కొంటున్నారా.? మీ మెంటల్ హెల్త్ ఇలా ఉందని అర్థం
Panic Buying Explained: ఆన్‌లైన్ షాపింగ్ పెరిగన తర్వాత కొందరు అవసరం లేకపోయినా కొందరు పెద్ద మొత్తంలో వస్తువులు కొనేస్తున్నారు.
Panic Buying
Panic Buying Explained: ఆన్‌లైన్ షాపింగ్ పెరిగన తర్వాత కొందరు అవసరం లేకపోయినా కొందరు పెద్ద మొత్తంలో వస్తువులు కొనేస్తున్నారు. ముఖ్యంగా ఒక వస్తువు త్వరగా అయిపోతుందేమో లేదా ప్రత్యేక ఆఫర్ మిస్ అవుతుందేమో అన్న భావన కలిగినప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మానసిక నిపుణులు దీనిని “పానిక్ బైయింగ్” (Panic Buying) గా చెబుతున్నారు.
పానిక్ బైయింగ్ అంటే ఏమిటి?
ఏదైనా వస్తువు త్వరలో కొరత పడుతుందనే అనుమానం వచ్చినప్పుడు లేదా ఇతరులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని చూసినప్పుడు కొందరు ఒక్కసారిగా ఎక్కువగా కొనడం ప్రారంభిస్తారు. ఇది చాలా సందర్భాల్లో FOMO (Fear of Missing Out) అనే భావనతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఒక అవకాశం లేదా మంచి డీల్ కోల్పోతామనే భయం. ఉదాహరణకు కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల, లిమిటెడ్ ఎడిషన్ షూస్, ఆన్‌లైన్ ఫ్లాష్ సేల్, క్రిప్టో లేదా ట్రెండింగ్ గాడ్జెట్‌లు వంటి సందర్భాల్లో కొందరు ఆలోచించకుండా వెంటనే కొనేస్తారు.
పానిక్ బైయింగ్ సమయంలో మెదడు ఎలా స్పందిస్తుంది?
సైకాలజీ ప్రకారం, ఒక ప్రోడక్ట్ గురించి “స్టాక్‌లో కొన్ని మాత్రమే మిగిలాయి” లేదా “ఆఫర్ త్వరలో ముగుస్తుంది” అనే సందేశాలు కనిపించినప్పుడు మన మెదడులోని అమిగ్డాలా (Amygdala) అనే భాగం చురుకుగా పనిచేస్తుంది.
ఈ భాగం సాధారణంగా ప్రమాదం లేదా నష్టం గురించి హెచ్చరికలు ఇచ్చే పని చేస్తుంది. ఇక్కడ ప్రమాదం అంటే వస్తువు కోల్పోవడం. అందుకే వెంటనే కొనాలనే ఆలోచన వస్తుంది. అది కొనుగోలు చేసిన తర్వాత మెదడులో డోపామైన్ (Dopamine) అనే కెమికల్ విడుదల అవుతుంది. దీంతో వ్యక్తికి సంతోషం లేదా విజయం సాధించినట్టు అనిపిస్తుంది.
ఎవరికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది?
సైకాలజీ నిపుణుల ప్రకారం కొన్ని రకాల వ్యక్తుల్లో పానిక్ బైయింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. వీరిలో భద్రతాభావం తక్కువగా ఉన్నవారు, ఇతరులతో తమను పోల్చుకునే అలవాటు ఉన్నవారు, ట్రెండ్స్‌ను త్వరగా అనుసరించే వారు ఎక్కువగా ఉంటారు. ఒక వస్తువు డిమాండ్ ఎక్కువగా ఉంది, సరఫరా తక్కువగా ఉందని భావించినప్పుడు మెదడు “సర్వైవల్ మోడ్” లోకి వెళుతుంది. “ఇది ఇప్పుడు కొనకపోతే తర్వాత దొరకకపోవచ్చు.” అన్న భావనలోకి ఆ వ్యక్తి వెళ్తాడు. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు ఏదైనా బ్రాండ్ లేదా ప్రోడక్ట్ కొనుగోలు చేస్తున్నట్లు చూస్తే అదే చేయాలనే కోరిక పెరుగుతుంది.
పానిక్ బైయింగ్ అలవాటు నుంచి ఎలా దూరంగా ఉండాలి?
నిపుణులు ఈ అలవాటు తగ్గించేందుకు కొన్ని సులభమైన సూచనలు ఇస్తున్నారు.
* ఏదైనా ఖరీదైన లేదా ట్రెండింగ్ వస్తువు కొనడానికి ముందు కొంత సమయం తీసుకోవాలి.
* ముందుగానే కొనాల్సిన వస్తువుల లిస్ట్ తయారు చేస్తే అవసరం లేని కొనుగోళ్లు తగ్గుతాయి.
* సేల్, డిస్కౌంట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎక్కువగా వస్తే కొనాలనే తపన పెరుగుతుంది.
* ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఆర్థికంగా కూడా మంచివి.
మొత్తం మీద పానిక్ బైయింగ్ అనేది ఒక మానసిక ప్రతిస్పందన. కొరత లేదా అవకాశం కోల్పోతామనే భయం దీనికి ప్రధాన కారణం. అయితే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అవసరం లేని ఖర్చులను సులభంగా తగ్గించుకోవచ్చు.