Isometric Exercise: ఐసోమెట్రిక్ వ్యాయామం అంటే ఏంటి.? బీపీ ఉన్న వారికి ఎలా ఉపయోగపడుతుంది
Isometric Exercise: ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే బీపీ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ మారిన జీవన విధానంతో ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు నిండని వారిలో కూడా బీపీ మొదలవుతుంది.
Isometric Exercise
Isometric Exercise: ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే బీపీ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. కానీ మారిన జీవన విధానంతో ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు నిండని వారిలో కూడా బీపీ మొదలవుతుంది. అయితే ఐసోమెట్రిక్ వ్యాయామం ద్వారా హైబీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హై బ్లడ్ ప్రెజర్ అంటే ఏంటి?
హై బ్లడ్ ప్రెజర్ లేదా హైపర్‌టెన్షన్ అనేది గుండె నుండి వెళ్లే రక్తం ధమనుల గోడలపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే పరిస్థితి. బ్లడ్ ప్రెజర్‌ను సాధారణంగా రెండు సంఖ్యలతో కొలుస్తారు. సిస్టోలిక్ ప్రెజర్ (Systolic) – గుండె రక్తాన్ని పంపే సమయంలో ఉండే ఒత్తిడి. డయాస్టోలిక్ ప్రెజర్ (Diastolic) – గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో ఉండే ఒత్తిడి. 120/80 mmHg ను సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. అయితే 130/80 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీగా పరిగణిస్తారు. రోజులో కొంతసేపు బీపీ పెరగడం సహజమే. కానీ అది ఎక్కువకాలం అలాగే కొనసాగితే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో వ్యాయామం పాత్ర
బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రించడంలో వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి అని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు చేసిన ఒక పెద్ద అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. సుమారు 13 సంవత్సరాల్లో జరిగిన 270 అధ్యయనాల డేటాను వారు విశ్లేషించారు. ఇందులో 15 వేల మందికిపైగా వ్యక్తుల వివరాలు ఉన్నాయి. ఆ విశ్లేషణలో, బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో ఐసోమెట్రిక్ వ్యాయామాలు చాలా ప్రభావవంతంగా ఉండొచ్చని తేలింది. ఇతర వ్యాయామాలతో పోలిస్తే ఇవి రక్తపోటు తగ్గించడంలో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
ఐసోమెట్రిక్ వ్యాయామం అంటే ఏమిటి?
ఐసోమెట్రిక్ వ్యాయామం అనేది మసిల్స్ కుదుస్తాయి కానీ శరీరంలోని జాయింట్లు కదలకుండా చేసే వ్యాయామం.
అంటే ఒకే స్థితిలో ఉండి మసిల్స్‌పై ఒత్తిడి పెడతారు. గోడకు ఆనుకుని వాల్ స్క్వాట్ చేయడం, హ్యాండ్ గ్రిప్ ను బలంగా పట్టు పట్టడం, కాళ్లతో స్థిరంగా ఉన్న వస్తువును ఒత్తడం, ప్లాంక్ వంటి స్థిరమైన వ్యాయామాలు ఈ జాబితాలోకి వస్ఆయి. ఈ వ్యాయామాల్లో శరీరం పెద్దగా కదలదు కానీ మసిల్స్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాయామం బీపీ తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?
నిపుణుల ప్రకారం, మసిల్స్‌ను కొంతసేపు కుదించి ఉంచినప్పుడు ఆ ప్రాంతంలో రక్తప్రవాహం తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ ఆ ఒత్తిడిని వదిలిన వెంటనే రక్తం మళ్లీ వేగంగా ప్రవహిస్తుంది. దీనివల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగవుతుంది, రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కలిసి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే ఇటీవల పరిశోధనల్లో ఈ వ్యాయామానికి ప్రాధాన్యం పెరుగుతోంది.
ఈ వ్యాయామం చేసే ముందు జాగ్రత్తలు
ఐసోమెట్రిక్ వ్యాయామాలు ప్రయోజనకరమైనవే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువసేపు మసిల్స్‌ను కుదించి ఉంచితే తాత్కాలికంగా బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. బీపీ పూర్తిగా నియంత్రణలో లేని వారు కూడా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వ్యాయామాన్ని సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. సరైన మార్గదర్శకత్వంతో చేస్తే ఇలాంటి వ్యాయామాలు హై బీపీ నియంత్రణలో మంచి సహాయక పద్ధతిగా ఉపయోగపడవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.