Vitamin D : మీ ముఖంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీకు విటమిన్ డి లోపించినట్లే
Vitamin D: మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Vitamin D: మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరి శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ సరైన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా, మన చర్మం, జుట్టు, గోర్లకు కూడా ఈ విటమిన్ చాలా మేలు చేస్తుంది. కానీ, శరీరానికి తగినంత విటమిన్ డి లభించనప్పుడు దాని లోపం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అలసట, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, గాయాలు త్వరగా నయం కాకపోవడం, జుట్టు రాలడం, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మన ముఖం కూడా విటమిన్ డి లోపం గురించి సూచనలు ఇస్తుంది. శరీరంలో తగినంత విటమిన్ డి లేకపోతే, ముఖంపై హఠాత్తుగా మొటిమలు కనిపిస్తాయి. చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొందరిలో దురదతో కూడిన ఎర్రటి దద్దుర్లు కూడా రావచ్చు.
విటమిన్ డి లోపం ముఖం, చర్మంపై మాత్రమే కాకుండా, జుట్టు, ఎముకల ఆరోగ్యంలో మార్పుల ద్వారా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, చర్మం నిస్తేజంగా మారుతుంది, జుట్టు సరిగా పెరగదు, జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఎముకలు బలహీనపడి త్వరగా విరిగిపోవచ్చు. విటమిన్ డి మన శరీరంలో కెరాటిన్ ప్రొటీన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని లోపం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, జుట్టు బలహీనపడటం, దంతాలు సులభంగా విరిగిపోవడం వంటివి సంభవించవచ్చు.
విటమిన్ డి లోపానికి ప్రధాన కారణం సూర్యరశ్మికి గురికాకపోవడం. ఎందుకంటే చర్మం సూర్యరశ్మి నుంచి విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, తగినంత విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకపోవడం కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా విటమిన్ డిని శరీరం సరిగా గ్రహించకుండా అడ్డుకోవచ్చు. నల్లని చర్మం ఉన్నవారు సూర్యరశ్మి నుంచి తక్కువ విటమిన్ డిని పొందుతారు. వీటన్నింటితో పాటు, మీరు తీసుకునే కొన్ని మందుల వల్ల కూడా విటమిన్ డి లోపం రావచ్చు.
పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే, మీకు విటమిన్ డి లోపం ఉందో లేదో పరీక్షించుకోండి. సహజంగా ఈ సమస్యను తగ్గించుకోవడానికి, ప్రతిరోజు ఉదయం 10 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండండి. విటమిన్ డి పుష్కలంగా లభించే చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు వంటి ఆహార పదార్థాలను తీసుకోండి. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.