Multivitamins: మల్టీవిటమిన్లు రోజూ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!
Multivitamins: మల్టీవిటమిన్ టాబ్లెట్లు ప్రతిరోజూ వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? విటమిన్ల అతి వినియోగం పై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Multivitamins
Multivitamins: బిజీ లైఫ్, పని ఒత్తిడి, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల మన శరీరానికి అందాల్సిన సహజ పోషకాలు అందడం లేదు. దీంతో చాలా మంది తమ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను మల్టీవిటమిన్ సప్లిమెంట్ల ద్వారా పొందాలని చూస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి, అలసట తగ్గించుకోవడానికి ఇవి మేలు చేస్తాయని భావిస్తారు. అయితే, మల్టీవిటమిన్లు అవసరమా? లేదా వాటి వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అతిగా వాడితే..
పలువురు వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ మల్టీవిటమిన్లు తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో పండ్లు, Multivitamins: ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు సమపాళ్లలో ఉంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు సహజంగానే అందుతాయని అన్నారు. పోషకాహార లోపం ఉందని నిర్ధారణ అయినప్పుడు మాత్రమే వైద్యులు వీటిని సిఫార్సు చేస్తారని వెల్లడించారు. అవసరం లేకున్నా విటమిన్ సప్లిమెంట్లను వాడటం వల్ల శరీరానికి మేలు కంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విటమిన్ A, D, E , K వంటివి శరీరంలో నిల్వ ఉంటాయి. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అవి శరీరంలో పేరుకుపోయి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. సప్లిమెంట్లు ఎప్పుడూ పోషక లోపాలను భర్తీ చేయడానికి మాత్రమే వాడాలి, కానీ వాటినే పూర్తి ఆహారంగా భావించకూడదని పేర్కొన్నారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే మల్టీవిటమిన్లను సూచిస్తారు..
* వృద్ధులకు వయసు రీత్యా ఆహారం నుంచి పోషకాలను గ్రహించే శక్తి తగ్గుతుంది.
* గర్భిణీ, పాలిచ్చే తల్లులకు వీటిని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి శిశువు ఎదుగుదల కోసం అదనపు పోషకాలు అవసరం.
* దీర్ఘకాలిక అలసట, బలహీనతతో బాధపడేవారు.
* సరైన డైట్ పాటించని వారు.
మల్టీవిటమిన్లు వాడాలని అనుకునే వారు ముందుగా తమ ఆహారపు అలవాట్లను గమనించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు, ఆకుకూరగాయలు, పాలు వంటి సహజ ఆహారాల ద్వారా పోషకాలు పొందడం ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు. ఏదైనా సప్లిమెంట్ వాడే ముందు రక్త పరీక్షలు చేయించుకుని, వైద్యుని సలహా మేరకు సరైన మోతాదులో తీసుకోవడం సురక్షితం అని చెప్పారు.