Milk : పాలు తాగితే ఐరన్ మ్యాన్ అయిపోతారా? ఎముకల గట్టితనానికి పాల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

ఎముకల గట్టితనానికి పాల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే

Update: 2026-01-24 04:10 GMT

Milk : పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. ముఖ్యంగా శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించుకోవడానికి పాలు ఒక్కటే మార్గమని చాలామంది భావిస్తుంటారు. అయితే, శరీరానికి అవసరమైన కాల్షియం కేవలం పాలు తాగడం వల్లే అందుతుందా? లేక ఇంకా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అనే విషయంపై వైద్యులు కీలక సమాచారాన్ని అందించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామంది ఎముకల బలహీనత, కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది పాలు. పాలలో ఉండే కాల్షియంను శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. మరీ ముఖ్యంగా పాలలో ఉండే విటమిన్ డి కాల్షియంను ఎముకలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తాగడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తుంటారు.

అయితే కేవలం పాలు మాత్రమే కాల్షియం లోపాన్ని పూర్తిగా నయం చేయగలవా అంటే డాక్టర్లు కాదు అని చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఎంత కాల్షియం అవసరమనేది వారి వయస్సు, లింగం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం పాలు తాగితే సరిపోదు. దానితో పాటు పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, నువ్వులు, బాదం వంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. అప్పుడే శరీరానికి వివిధ వనరుల నుంచి కాల్షియం అందుతుంది.

సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 2 గ్లాసుల పాలు (సుమారు 400 నుంచి 500 మి.లీ) తాగవచ్చు. ఇది రోజువారీ కాల్షియం అవసరాలను తీరుస్తుంది. కానీ గర్భిణీలు, ఎదుగుతున్న పిల్లలు ఇంకా ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, సోడాలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలోని కాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి పాలు తాగుతూనే, చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం.

కొంతమందికి పాలు తాగగానే జీర్ణం కాకపోవడం (లాక్టోస్ ఇంటాలరెన్స్) వంటి సమస్యలు ఉంటాయి. అలాంటి వారు పాలకు బదులుగా ఇతర కాల్షియం ఆహారాలను ఎంచుకోవడం లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే, అవసరానికి మించి పాలు తాగడం వల్ల కూడా అదనపు ప్రయోజనం ఉండదని, సమతుల్య ఆహారం తీసుకోవడమే ఆరోగ్యానికి అసలైన సూత్రమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News