Weight Gain Reasons : తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు

తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు

Update: 2026-01-24 04:53 GMT

Weight Gain Reasons : చాలామంది బరువు తగ్గాలనే ఆత్రుతతో డైటింగ్ పేరుతో ఆహారాన్ని బాగా తగ్గించేస్తారు. కానీ ఫలితం మాత్రం రివర్స్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం మెటబాలిజం మందగించడం. మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియే మెటబాలిజం. వయస్సు పెరిగే కొద్దీ, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల మీరు తక్కువ తిన్నా, ఆ క్యాలరీలు ఖర్చు కాకుండా కొవ్వు రూపంలో శరీరంలో పేరుకుపోతాయి.డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శరీరం క్యాలరీలను కరిగించే వేగం తగ్గడమే ఈ సమస్యకు మూలం.

మరో ముఖ్య కారణం హార్మోన్ల అసమతౌల్యం. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు, గర్భధారణ తర్వాత వచ్చే మార్పులు లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆహారం తగ్గించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా ఆకలితో ఉండటం వల్ల శరీరం "స్టార్వేషన్ మోడ్"లోకి వెళ్లి, ఉన్న కొవ్వును కరిగించకుండా దాచిపెట్టుకుంటుంది. దీనివల్ల బరువు తగ్గాల్సింది పోయి పెరుగుతారు.

ఆహారం తీసుకునే పద్ధతిలో లోపాలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి. చాలామంది ఎక్కువ సేపు ఆకలితో ఉండి, ఆ తర్వాత ఒకేసారి తినేస్తుంటారు. లేదా అవసరమైన దానికంటే అతి తక్కువ తింటారు. ఇలా చేయడం వల్ల శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. అలాగే స్టెరాయిడ్ మందులు వాడే వారిలో కూడా ఈ తరహా బరువు పెరుగుదల కనిపిస్తుంది. నిద్రలేమి, విపరీతమైన ఒత్తిడి కూడా శరీరంలో కొవ్వును పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి.

బరువును అదుపులో ఉంచుకోవాలంటే కేవలం ఆహారం తగ్గించడం మాత్రమే సరిపోదు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర తప్పనిసరి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా పౌష్టికాహారాన్ని సరైన సమయానికి, సరైన మోతాదులో తీసుకోవాలి. బరువు పెరగడం అనేది కేవలం తిండికి సంబంధించింది మాత్రమే కాదు, అది మీ జీవనశైలికి ప్రతిబింబమని గుర్తించాలి.

Tags:    

Similar News