Mounjaro Injection: మోంజారో ఇంజెక్షన్‌తో బరువు తగ్గుతారా? నిపుణుల వివరణ
Mounjaro Injection:మోంజారో ఇంజెక్షన్ టైప్-2 డయాబెటిస్ మందు. వెయిట్ లాస్‌కు ఉపయోగమా? దుష్ప్రభావాలు ఏమిటి? నిపుణుల సూచనలు తెలుసుకోండి.
Mounjaro Injection :మోంజారో ఇంజెక్షన్‌తో బరువు తగ్గుతారా? నిపుణుల వివరణ
టైప్-2 డయాబెటిస్ నియంత్రణ కోసం వాడే మోంజారో (Mounjaro) ఇంజెక్షన్ భారత్‌లో తాజాగా వెయిట్ లాస్ మెడిసిన్‌గా ట్రెండ్ అవుతోంది. ఇందులో ఉండే టిర్జెపటైడ్ (Tirzepatide) అనే క్రియాశీలక పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఆకలి తగ్గించి, కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువు తగ్గడంలో పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముంబయికి చెందిన స్టాండప్ కమెడియన్ ఐశ్వర్య మోహనరాజ్ ఇటీవల తన సోషల్ మీడియా వేదికగా మోంజారో ఇంజెక్షన్ ఉపయోగించి బరువు తగ్గిన అనుభవాన్ని పంచుకున్నారు. పెళ్లి తర్వాత బరువు పెరగడం, హైపోథైరాయిడిజం, పీసీఓడీ సమస్యల కారణంగా వెయిట్ లాస్ డైట్, వర్కౌట్స్ చేసినా ఫలితం కనిపించలేదని ఆమె తెలిపారు.
వారానికి ఒకసారి ఆరు నెలల పాటు మోంజారో ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తన బరువు 74 కేజీల నుంచి 52 కేజీలకు తగ్గిందని చెప్పారు. అయితే మొదటి నెలలో నాజియా, నీరసం, జుట్టు ఊడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురైనట్లు వెల్లడించారు. ఒక్కో ఇంజెక్షన్ ధర సుమారు రూ.4,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ విషయంపై సినీ నటి సోహా అలీ ఖాన్ స్పందిస్తూ, వెయిట్ లాస్ కోసం ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంటే వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి అని సూచించారు.
మోంజారో ఎలా పనిచేస్తుంది?
యూకేకు చెందిన ఎలక్ట్రానిక్ మెడిసిన్స్ కంపెండియమ్ (EMC) ప్రకారం, మోంజారో ఇంజెక్షన్ ఆకలి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపు ఖాళీ కావడాన్ని ఆలస్యం చేసి, తక్కువ ఆహారం తీసుకున్నా తృప్తి భావన కలిగిస్తుంది. ఫుడ్ క్రేవింగ్స్ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది.
జాగ్రత్తలు
నిపుణుల ప్రకారం, మోంజారో ఇంజెక్షన్ ప్రధానంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే సూచించబడుతుంది. వెయిట్ లాస్ కోసం స్వయంగా తీసుకోవడం ప్రమాదకరం కావచ్చు. వాంతులు, నాజియా, తలనొప్పి, జుట్టు ఊడిపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఈ ఇంజెక్షన్ వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.