International Womens Day : అమ్మాయిల ఆకలి కేకల నుంచి పుట్టిన రోజు..మార్చి 8 వెనుక ఉన్న అసలు చరిత్ర ఇది
International Womens Day : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2026 థీమ్, చారిత్రక నేపథ్యం, నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక విశ్లేషణ చూద్దాం.
International Womens Day 2026
International Womens Day : ప్రతి ఏటా మార్చి 8వ తేదీ వస్తుందంటే చాలు.. సోషల్ మీడియా అంతా శుభాకాంక్షలతో నిండిపోతుంది. మహిళల గొప్పతనాన్ని చాటిచెప్పే కవితలు, ఫోటోలు సందడి చేస్తాయి. అయితే, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక కేవలం సంబరాలు మాత్రమే లేవు.. కొన్ని దశాబ్దాల పోరాటం, వేలాది మంది మహిళల త్యాగం, ఆకలి కేకలు, సమాన హక్కుల కోసం చేసిన నినాదాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు ఓటు హక్కు కోసం, పని గంటల తగ్గింపు కోసం రోడ్డెక్కిన మహిళల ఆవేదన నేడు ఒక అంతర్జాతీయ వేడుకగా మారింది.
2026 థీమ్ - హక్కులు.. న్యాయం.. కార్యాచరణ
ఈ ఏడాది (2026) మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఒక ప్రత్యేక నినాదాన్ని ఇచ్చింది. అదే.. “ప్రతి మహిళకు, బాలికకు హక్కులు, న్యాయం, కార్యాచరణ”. అంటే కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, అవి అమలు కావాలి, మహిళలకు న్యాయం అందాలి అని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది. మరోవైపు గివ్ టు గెయిన్ అనే క్యాంపెయిన్ ద్వారా మహిళా సాధికారతకు మన వంతుగా తోడ్పాటు అందించాలని సూచిస్తోంది.
చరిత్రలో ఈ రోజు వెనుక ఉన్న కథ
ఈ ప్రస్థానం 1908లో న్యూయార్క్‌లో మొదలైంది. తక్కువ జీతం, ఎక్కువ పని గంటలకు వ్యతిరేకంగా 15 వేల మంది మహిళలు చేసిన ఆందోళన ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఆ తర్వాత 1910లో క్లారా జెట్కిన్ అనే మహిళ మహిళా దినోత్సవం ఆలోచనను తెరపైకి తెచ్చారు. రష్యాలో 1917 మార్చి 8న మహిళలు ఆహారం, శాంతి కోసం జరిపిన పోరాటం ఈ తేదీకి ఒక చారిత్రక ప్రాధాన్యతను ఇచ్చింది. చివరకు 1975లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా గుర్తించింది.
నేటి సవాళ్లు - మన పాత్ర
నేడు మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, దేశాలను ఏలుతున్నారు, వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తున్నారు. కానీ, ఇంకో వైపు చూస్తే.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే మహిళలకు చట్టపరంగా లభిస్తున్న హక్కులు కేవలం 64 శాతం మాత్రమే. అంటే ఇంకా 36 శాతం వెనుకబడే ఉన్నాం. పని ప్రదేశాల్లో వేతన వ్యత్యాసం, గృహ హింస, విద్యకు దూరం కావడం వంటి సమస్యలు నేటికీ సవాళ్లుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్న తరుణంలో మహిళలకు సాంకేతిక విద్యలో సమాన అవకాశాలు కల్పించడం అత్యవసరం.
మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక రోజు గౌరవం ఇవ్వడం కాదు.. మిగిలిన 364 రోజులు కూడా ఆమెకు సమాన అవకాశం, భద్రత కల్పించడం. ఇంట్లో అమ్మగా, చెల్లిగా, భార్యగా ఆమె ఇచ్చే సహకారాన్ని గుర్తిస్తూనే.. సమాజంలో ఒక వ్యక్తిగా ఆమె ఎదగడానికి తోడ్పడటమే ఈ రోజు మనం ఇచ్చే అసలైన బహుమతి.