Chanakya Niti: వివాహ బంధాన్ని దెబ్బ తీసే అంశాలు ఇవే.. ఆచార్య చాణుక్యుడు ఏమి చెప్పారంటే..
Chanakya Niti: భార్యాభర్తల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలి. వారి బంధం కలకాలం నిలవాలంటే ఏమి చేయాలనే విషయాన్ని ఆచార్య చాణక్యుడు చక్కగా చెప్పారు.
Chanakya Niti
Chanakya Niti: భార్యాభర్తల మధ్య బంధం చాలా విలువైనది. అలాగే సున్నితమైనది కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో వైవాహిక జీవితాలు అస్తవ్యస్తం అవడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలకే విడాకుల వరకూ జంటలు వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన.. ఒకరిపై ఒకరికి గౌరవం.. ఇలా చాలా అంశాలు దాంపత్య జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి ఇద్దరి మధ్య వచ్చే ఈగో క్లాష్ కూడా బంధాన్ని తెంచేసేలా మారిపోతుంది.
Chanakya Niti: ఆచార్య చాణక్య అఖండ భారతావనిలో అద్భుతమైన రాజనీతి దిక్సూచిగా నిలిచారు. ఆయన రాజనీతితో పాటు మానవ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు పరిష్కారం అదేవిధంగా సవాళ్ళను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు సవివరంగా వివరించారు. తరాలు గడిచినా.. ఆచార్య చాణక్య నీతి ఇప్పటికీ ఆచరణీయమే. ఆయన చెప్పిన విషయాలను ప్రస్తుత జీవితానికి అన్వయం చేసుకుంటే ఎన్నో విషయాల్లో మెరుగైన పరిస్థితి మన జీవితాల్లో వస్తుంది అనడంలో సందేహం లేదు. చాణక్యుడు భార్యాభర్తల బంధం ఎలా ఉండాలి? ఏ అంశాలు వైవాహిక బంధాన్ని విడాకుల వైపు తీసుకుపోతాయి అనే విషయంపై చెప్పిన కొన్ని చక్కటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కమ్యూనికేషన్: సంబంధాన్ని బలోపేతం చేయడంలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. దాంపత్య జీవితంలో చిన్న విషయాలు అనుకునేవి ఒక్కోసారి పెద్ద గొడవగా మారిపోతాయి. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటె అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఏ విషయమైనా చిన్నదే కదా అని వదిలేయకుండా దంపతులు ఇద్దరూ వాటి గురించి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు తలెత్తకుండా ఉంటాయని చాణక్యుడు చెప్పారు.
స్వార్థం: భర్త తన గురించి మాత్రమే తాను ఆలోచిస్తే, అలాగే భార్య తన గురించి మాత్రమే తాను ఆలోచిస్తే ఆ దాంపత్యంలో చిచ్చు తప్పదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించకుండా స్వార్థపూరిత జీవితాన్ని గడుపుతుంటే, అలాంటి సంబంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కాబట్టి, సంబంధంలో స్వార్థం ఉండకూడదు.
అహంకారం: దీనినే మనం ఈగో అని చెప్పుకుంటాం. ఈగో ఎటువంటి వారినైనా కిందకు లాగేస్తుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో నేనే సరైనవాడిని, నేను చేసినదంతా సరైనదే" అనే అహంకార వైఖరి ఉంటే, ఆ సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి, భార్యాభర్తల మధ్య ఎలాంటి అహంకారం ఉండకూడదు.
రహస్యాలు: ప్రతి వ్యక్తికి బలాలు - బలహీనతలు ఉంటాయి. ఈ సందర్భంలో, భార్య తన భర్త బలహీనతలను ఇతరులతో పంచుకోకూడదు. అలాగే భర్త తన భార్య బలహీనతలను వేరేవారి దగ్గర ప్రస్తావించకూడదు. వారు దగ్గరి బంధువులైనా.. స్నేహితులైన భార్యా,భర్తల మధ్య ఉండే రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. దీనివలన అవతలి వారి దగ్గర చులకన కావడమే కాకుండా దాంపత్య జీవితం కచ్చితంగా చిక్కుల్లో పడుతుంది.
కోపం: ప్రతి సమస్యకూ కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే కోపం సంఘర్షణకు, విబేధాలకు దారితీస్తుంది. కాబట్టి, భార్యాభర్తల మధ్య కోపం ఉండకూడదు.
అగౌరవం: ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం. అలాగే, భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో గౌరవం కూడా అంతే ముఖ్యం. ఒకరు మరొకరి పట్ల అగౌరవం చూపిస్తే, అలాంటి సంబంధం ఎక్కువ కాలం ఉండదు.
అబద్ధం: భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఒకరు మరొకరికి అబద్ధం చెబితే, వారు ఒకరి నుండి ఒకరు ఏదైనా దాచిపెడితే, అది సంబంధాన్ని నాశనం చేస్తుంది.
అదండీ విషయం ఆచార్య చాణక్యుడు దాంపత్య జీవితం గురించి ఇచ్చిన అమూల్యమైన సూచనల్లో ఇవి కొన్ని. వీటిని ఫాలో అవడం ద్వారా దాంపత్య బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.