Stop Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త!

అతిగా ఆలోచించడం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల గురించి నిపుణుల హెచ్చరికలు, ఓవర్‌థింకింగ్ లక్షణాలు, దాని నుంచి బయటపడటానికి సరైన మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.

Update: 2026-03-09 12:04 GMT

Stop Overthinking: అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త!

నేటి జీవనశైలిలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య 'అతిగా ఆలోచించడం' (Overthinking). పని ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళన వంటి కారణాలతో చిన్న విషయాలను కూడా పెద్దవిగా ఊహించుకుంటూ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. అతిగా ఆలోచించడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది క్రమంగా మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఒక తీవ్రమైన సమస్య అని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం ఏదో ఒక విషయం గురించి మధనపడటం వల్ల మనస్సుతో పాటు శరీరం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరంపై ప్రభావం..

ఓవర్‌థింకింగ్ వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. నిరంతర మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి, విపరీతమైన అలసట, నీరసం ఆవహిస్తాయని చెప్పారు. ఆలోచనల సుడిగుండంలో పడి చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టదని, ఒకవేళ పట్టినా మధ్యలో తరచూ మెలకువ వస్తుందని అన్నారు. అతిగా ఆలోచించే వారు ఏ పని మీద లేదా చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేరని చెప్పారు. దీర్ఘకాలిక ఒత్తిడి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని, దీనివల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చిన్న విషయాలకే చిరాకు పడటం, అశాంతి, ఆందోళన పెరగడం వంటి లక్షణాలు ఓవర్‌థింకింగ్ చేసే వారిలో కనిపిస్తాయన్నారు.

ఓవర్‌థింకింగ్‌ బారిన పడ్డారని చెప్పడానికి సంకేతాలు ఇవే..

* చిన్న చిన్న విషయాల గురించి పదే పదే ఆందోళన చెందడం.

* మనస్సును ప్రశాంతంగా ఉంచుకోలేకపోవడం.

* ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళనతో ఉండటం.

* రోజూ చేసే పనులను కూడా భారంగా భావించడం.

ఓవర్‌థింకింగ్‌ నుంచి ఎలా కాపాడుకోవాలంటే..

జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనస్సు అదుపులోకి వస్తుంది. యోగా శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తుందంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో 'ఫీల్ గుడ్' హార్మోన్లు విడుదలయ్యి ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. పడుకునే ముందు ఆలోచనలకు స్వస్తి పలికే ప్రయత్నం చేయాలని అంటున్నారు. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. ఆందోళన లేదా ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, ఏమాత్రం సంకోచించకుండా నిపుణులైన వైద్యుడిని లేదా కౌన్సిలర్‌ను సంప్రదించడం ఉత్తమం అని సూచించారు.

Tags:    

Similar News