Fatty Liver: ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ తాగని వారికి కూడా వస్తుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
Fatty Liver: కేవలం మద్యం తాగేవారికే ఫ్యాటీ లివర్ వస్తుందా? సన్నగా ఉండేవారికి ఈ ముప్పు లేదా? ఫ్యాటీ లివర్‌పై ఉన్న అపోహలు, కాలేయాన్ని కాపాడుకునే మార్గాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
Fatty Liver: ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ తాగని వారికి కూడా వస్తుందా? నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజాలివే!
Fatty Liver: ఈ రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. నిజానికి చాలా మంది దీనిని ఒక సాధారణ సమస్యగా భావిస్తారు, కానీ సరైన సమయంలో స్పందించకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యాటీ లివర్‌పై ప్రజల్లో ఉన్న కొన్ని ప్రధాన అపోహలు ఏంటి, వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్యాటీ లివర్‌పై ప్రజల్లో ఉన్న కొన్ని ప్రధాన అపోహలు..
1: కేవలం మద్యం తాగే వారికి మాత్రమే ఫ్యాటీ లివర్ వస్తుంది.
ఇది పూర్తిగా తప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుందన్నారు. దీనిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, ఇన్సులిన్ నిరోధకత, పెరుగుతున్న ఊబకాయం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
2: లావుగా ఉన్న వారికి మాత్రమే ఈ సమస్య ఉంటుంది.
సన్నగా ఉండేవారికి ఫ్యాటీ లివర్ రాదు అనుకోవడం పొరపాటు అని అంటున్నారు. బయటకు సన్నగా కనిపించినప్పటికీ, శరీర అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని లీన్ NAFLD అని పిలుస్తారని చెప్పారు. కాబట్టి శరీర ఆకృతిని బట్టి కాలేయం ఆరోగ్యంగా ఉందని నిర్ధారించలేమని వెల్లడించారు.
3: బ్లడ్ రిపోర్ట్ (SGPT) నార్మల్‌గా ఉంటే భయపడక్కర్లేదు.
చాలా మంది కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో SGPT సాధారణంగా ఉంటే కాలేయం బాగుందని అనుకుంటారు. కానీ, వ్యాధి ప్రారంభ దశలో ఎంజైమ్‌లు సాధారణంగానే ఉన్నా, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అప్పటికే మొదలవ్వవచ్చని అంటున్నారు. కాబట్టి కేవలం రక్త పరీక్షల మీద మాత్రమే ఆధారపడటం సరికాదని చెబుతున్నారు.
4: ఫ్యాటీ లివర్ అస్సలు ప్రమాదకరం కాదు.
ఫ్యాటీ లివర్ గ్రేడ్-1 దశలో ఉన్నప్పుడు జీవనశైలి మార్పులతో నియంత్రించవచ్చని వైద్యులు అంటున్నారు. కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తే, అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి ప్రమాదకర దశలకు చేరుకుంటుందన్నారు. చివరికి ఇది కాలేయం పూర్తిగా దెబ్బతినడానికి దారితీస్తుందని వెల్లడించారు.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి..
మీ కాలేయాన్ని రక్షించుకోవడానికి డాక్టర్లు పలు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే.. శుద్ధి చేసిన పిండి, పంచదార, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. రోజుకు కనీసం 30-40 నిమిషాల శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. కాలేయంపై ఒత్తిడి తగ్గించాలంటే ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానుకోవాలి. ప్రతి ఏటా కనీసం ఒక్కసారైనా కాలేయ పరీక్షలు (లివర్ స్క్రీనింగ్) చేయించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.