India - US Relations: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?
Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?
Modi meets Donald Trump: ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసింది. గతంలో మోదీ అమెరికా వెళ్లినప్పటి కంటే ఈసారి పర్యటనే ఎక్కువ కీలకంగా మారింది. ఎందుకంటే ఈసారి అమెరికా కొత్త అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారత్ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను చూస్తోంది. ట్రంప్ సర్కార్ అమెరికాలో అక్రమవలసదారులైన భారతీయుల కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేసి మిలిటరి విమానాల్లో పంపించింది.
ఇదే విషయమై అమెరికా తీరును తప్పుపడుతూ పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెప్పాయి. అమెరికాతో భారత ప్రభుత్వం ఆమాత్రం మాట్లడలేదా అని విపక్షాలు మోదీ సర్కారుని ప్రశ్నించాయి. పైగా అమెరికాకు భారత్ నుండి వెళ్లే ఎగుమతులపై ఎక్కువ సుంకం వేస్తామని ట్రంప్ బెదిరించారు. ఇలా ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ప్రధాని మోదీ అమెరికా వెళ్లి ట్రంప్‌తో భేటీ అయ్యారు.
మరి ఈ భేటీలో ఏం చర్చించారు? రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలకు ఏమైనా పరిష్కారం దొరికిందా? అక్రమవలసదారులను భారత్‌కు పంపించే తీరు మార్చుకొమ్మని ట్రంప్‌ను మోదీ ఏమైనా స్పెషల్ రిక్వెస్ట్ చేశారా? ట్రంప్ ఇండియాకు ఏదైనా మినహాయింపు ఇచ్చి కొత్త గుడ్ న్యూస్ చెప్పారా అనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం
రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అమెరికా వెళ్లిన మోదీకి మాత్రం ట్రంప్ నుండి ఘన స్వాగతమే లభించింది. మేం మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యామని చెబుతూ మోదీని ట్రంప్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మిమ్మల్ని మరోసారి కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ మోదీ బదులిచ్చారు. అంతేకాదు... మీడియా సమావేశంలోనూ ట్రంప్ మాట్లాడుతూ, ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు.
మోదీ తనకు చాలా మంచి స్నేహితుడని అన్నారు. తనకంటే మోదీ కఠినమైన రాయబారి అని చెబుతూ ఆ విషయంలో ఆయనకు అసలు పోటీయే లేదన్నారు. అన్నింటికి మించి మోదీకి "అవర్ జర్నీ టుగెదర్" అనే పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూ... దానిపై "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్" అని రాసిచ్చారు. ట్రంప్ ఫస్ట్ టైమ్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి ముఖ్యమైన ఘటనల ఫోటోగ్రాఫ్స్‌తో కూడిన పుస్తకం అది. ఇలా మోదీతో స్నేహం తనకు చాలా ప్రత్యేకం అని ట్రంప్ తన ప్రతీ మాటలో చెప్పుకొచ్చారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ... మరి మోదీని ఇంతగా పొగిడిన ట్రంప్, ఆ స్నేహానికి విలువిస్తూ ఇండియాతో కొత్తగా ఏం ఒప్పందాలు చేసుకున్నారనేదే ఇక్కడ ముఖ్యం.
MAGA + MIGA = MEGA
ఈ భేటీలో అమెరికా, ఇండియా 500 బిలియన్ డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలనే అంగీకారానికొచ్చాయి. 2030 నాటికి ఆ లక్ష్యం పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఈ ఒప్పందాల గురించి మోదీ మాట్లాడుతూ అమెరికాను ధనిక దేశంగా చూడాలనేది ట్రంప్ లక్ష్యమని గుర్తుచేశారు.
ట్రంప్ మగా అనే నినాదంతో ముందుకెళ్తున్నారని మోదీ అన్నారు. మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని అర్థం. అలాగే భారత్ కూడా వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. అమెరికా భాషలో చెప్పాలంటే దానిని మిగా అని అనవచ్చన్నారు. మిగా అంటే మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ అని అర్థం కూడా చెప్పారు. అమెరికా, భారత్ కలిసి పనిచేస్తే రెండు దేశాల లక్ష్యాలైన మగా ప్లస్ మిగా రెండూ కలిసి మెగా పార్ట్‌నర్‌షిప్ అవుతుందని మోదీ కొత్త అర్థం చెప్పారు.
అమెరికా నుండి 25 బిలియన్ డాలర్ల ఎనర్జీ కొనుగోలు
అమెరికా నుండి భారత్ గత ఏడాది 15 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ కొనుగోలు చేసింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రెండూ కలిపి ఇకపై ఆ మొత్తాన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ నిర్ణయించుకుంది. ఈ ఒప్పందంతో ఇండియా-అమెరికా మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం లోటును పూడ్చినట్లవుతుందని భారత్ విదేశాంగ శాఖ చెబుతోంది. ట్రంప్ కూడా అదే కోరుకుంటున్నారు.
ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఇంకో విషయం కూడా గుర్తుచేసుకోవాలి. యూరప్ దేశాలు అమెరికాతో కొత్తగా ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం లేదని ట్రంప్ గతంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేకాదు... యూరప్ దేశాలు అమెరికా నుండి ఆయిల్, గ్యాస్ కొనాల్సిందిగా ఆర్డర్ వేశారు. లేదంటే ఆయా దేశాలతో జరిపే ఎగుమతులు, దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఇండియా కూడా అలాంటి వెలితిని కవర్ చేసుకోవడానికే అమెరికా నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులు పెంచుతోంది.
భారత్ - చైనా బార్డర్ పంచాయితీ
భారత్, చైనా మధ్య గత కొన్ని దశాబ్ధాలుగా సరిహద్దు విషయంలో విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సరిహద్దు పంచాయితీలో మధ్యవర్తిగా రాయబారం చేసేందుకు అమెరికా రెడీ అంటోంది. ఇదే విషయమై ట్రంప్ మాట్లాడుతూ అప్పుడప్పుడు ఇండియా, చైనా ఆర్మీ బలగాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయన్నారు. అవి ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదని.. ఒకవేళ ఈ విషయంలో తన సహాయం అవసరం అనుకుంటే.. "ఐయామ్ రెడీ టు హెల్ప్" అని ప్రకటించారు.
అక్రమవలసదారుల గురించి మోదీ మాటేంటి?
అమెరికాలో ఉన్న అక్రమవలసదారులలో భారతీయులను వెనక్కి తీసుకునేందుకు మేం సిద్ధమేనని మోదీ మరోసారి ప్రకటించారు. అయితే, అసలు సమస్య అంతకంటే వేరే ఉందన్నారు. హ్యూమన్ ట్రాఫికర్స్ తప్పుడు హామీలతో జనాన్ని తప్పుదోవపట్టించి అక్రమపద్ధతుల్లో వారిని తరలిస్తుండమే పెద్ద సవాలని మోదీ హైలైట్ చేశారు. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్‌ను వెనక్కు పంపించే క్రమంలో అమెరికా అనుసరిస్తున్న తీరు గురించి మోదీ ఏమీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
రానాను భారత్‌కు అప్పగిస్తున్న అమెరికా
2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదుల దాడి కేసులో తహవూర్ రానా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రానాను తమకు అప్పగించాల్సిందిగా ఇండియా గతంలోనే ఎక్స్‌ట్రాడిషన్ పిటిషన్ పెట్టింది. ఈ పిటిషన్ పై జనవరి నెలలోనే అమెరికా సుప్రీం కోర్టు రానాను భారత్ కు అప్పగించేందుకు ఓకే చెప్పింది. తాజాగా ట్రంప్ కూడా అదే గుర్తుచేసుకున్నారు. రానా చేసిన నేరానికి అతడికి భారత్ లోనే శిక్షపడాలన్నారు. అందుకే రానాను భారత్ కు అప్పగిస్తున్నామని ప్రకటించారు.
టారిఫ్స్ విషయంలో మససు మార్చుకోని ట్రంప్
అమెరికాకు ఇండియా ఎగుమతి చేసే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. మోదీ అమెరికా పర్యటనతో ఇందులో ఏమైనా మార్పు వస్తుందని ఇండియాలో మార్కెట్ వర్గాలు ఆశించాయి. కానీ ట్రంప్ మాత్రం అమెరికాకు ఏ దేశమైనా వారు ఎంత సుంకం విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని మరోసారి ప్రకటించారు. అది ఇండియా అయినా మరో దేశమైనా తన తీరులో మార్పులేదని చెప్పేశారు.
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
బ్రిక్స్ దేశాలకు ట్రంప్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అంతర్జాతీయ వాణిజ్యంలో కరెన్సీ మార్పిడి కోసం డాలర్ స్థానంలో బ్రిక్స్ దేశాలు మరో కొత్త కరెన్సీ తేవాలనుకుంటే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తానని అన్నారు. అయినా తాను గతంలో ఈ విషయాన్ని చెప్పిన మరుక్షణమే బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని సృష్టించే విషయంలో వెనక్కు తగ్గాయని కూడా చెప్పారు. ఇక బ్రిక్స్ దేశాలకు అంత సాహసం చేసే ధైర్యం లేదన్నారు. ఇంకా చెప్పాలంటే అసలు బ్రిక్స్ ఆ క్షణమే చచ్చిపోయిందన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎటువైపు?
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో భారత్ న్యూట్రల్‌గా ఉంటోందని చాలామంది అనుకుంటున్నారు. కానీ భారత్ ఈ విషయంలో న్యూట్రల్‌గా లేదు. నేను రెండు దేశాధినేతలను కలిసి మాట్లాడాను. భారత్ ఎప్పుడూ ఆ రెండు దేశాల మధ్య శాంతి స్థాపన కోసమే కృషి చేస్తుందన్నారు.
పుతిన్‌తో కలిసి ఉన్నప్పుడు కూడా మీడియా ముందు ఇదే విషయం చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నాను. ఈరోజుల్లో యుద్ధంతో సమస్యకు పరిష్కారం దొరకదు. ఒకదగ్గర కూర్చుని మాట్లాడుకుంటేనే ఏ సమస్యయినా పరిష్కారమవుతుందన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయత్నాన్ని అభినందించవచ్చని మోదీ అభిప్రాయపడ్డారు.
మోదీ అమెరికాలో ఉండగానే బాంబు పేల్చిన ట్రంప్
ఓవైపు అమెరికాతో స్నేహం కోరుతూ ప్రధాని మోదీ అమెరికా పర్యటిస్తున్నారు. మరోవైపు అదే సమయంలో డోనల్డ్ ట్రంప్ భారత్‌లో విదేశీ పెట్టుబడుల విషయంలో పెద్ద బాంబు పేల్చారు. మోదీతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భేటీపై మీరు ఏమని స్పందిస్తారని అమెరికన్ మీడియా ట్రంప్‌ను కోరింది.
అందుకు ట్రంప్ స్పందిస్తూ... "మస్క్ భారత్‌లో వ్యాపారం చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లున్నారు. కానీ అక్కడ వ్యాపారం చేయడం చాలా కష్టం. భారత్‌లో ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తారు" అని కామెంట్ చేశారు. మోదీతో భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌పై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. భారత్ అమెరికాపై ఎక్కువ ఇంపోర్ట్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ట్రంప్ గతంలో కూడా ఆరోపించారు. చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో భారత్‌ను పోల్చారు.
ఇండియాలో ఎలాన్ మస్క్ బిజినెస్ ఎంట్రీ?
ఇక ఇదిలావుంటే, ఎలాన్ మస్క్ కూడా భారత్‌లో తన వ్యాపారాన్ని పెంచుకోవాలని ఎప్పటినుండో ఉవ్విళ్లూరుతున్నారు. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఉంది. అలాగే ఇంటర్నెట్ ఆధారిత సేవలకు కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే తన టెస్లా కార్లతో పాటు స్టార్‌లింక్ సేవలను కూడా ఇండియాలో లాంచ్ చేయాలని మస్క్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ టెస్లా కార్లపై భారత్ భారీ మొత్తంలో సుంకం విధిస్తుండం ఆయనకు నచ్చడం లేదు. అందుకే అది వాయిదా పడుతూ వస్తోంది.
ఇక స్టార్‌లింక్ విషయానికొస్తే... భారత్‌లో స్టార్‌లింక్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తే ప్రైవసీ, సెక్యురిటీ దెబ్బతింటాయేమోనని భారత్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దానికితోడు ఇండియాలో ఉన్న టెలికాం, శాటిలైట్ సర్వీసెస్ బిజినెస్‌లు కూడా స్టార్‌లింక్ రాకపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే స్టార్‌లింక్ వ్యాపారానికి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
మరి ఈ భేటీ తరువాత రానున్న రోజుల్లో ఇండియాలో మస్క్ బిజినెస్ విషయంలో మోదీ ఏమైనా మెతక వైఖరిని అనుసరిస్తారా అనే చర్చ మొదలైంది. లేదంటే మోదీ గురించి ట్రంప్ చెప్పినట్లుగా 'టఫ్ నెగోషియేటర్'గానే ఉంటారా అనేది వేచిచూడాల్సిందే. ఇది నేటి ట్రెండింగ్ స్టోరీ.