వెన్ను చూపను.. వెనుదిరగనన్న అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. నటుడిగా మొదలై దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు.?

Ukraine President: ఎవరో వస్తారనీ, ఏదో చేస్తారనీ ఎదురు చూడలేదు.. శత్రు సేనలు చుట్టుముట్టినా బెదిరిపోలేదు.. దేశం విడిచి వచ్చేయండి, రక్షణ కల్పిస్తామన్న అగ్రరాజ్యం ఆహ్వాన్ని కాదన్నారు.

Update: 2022-02-26 16:00 GMT

వెన్ను చూపను.. వెనుదిరగనన్న అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. నటుడిగా మొదలై దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు.?

Ukraine President: ఎవరో వస్తారనీ, ఏదో చేస్తారనీ ఎదురు చూడలేదు.. శత్రు సేనలు చుట్టుముట్టినా బెదిరిపోలేదు.. దేశం విడిచి వచ్చేయండి, రక్షణ కల్పిస్తామన్న అగ్రరాజ్యం ఆహ్వాన్ని కాదన్నారు. దేశం కోసం, నాలుగు కోట్ల మంది దేశ ప్రజల కోసం తానే సైనికుడయ్యారు. దూసుకొస్తున్న బుల్లెట్లకు ఎదురెళ్లి మరీ పోరాడుతూ ప్రపంచ దేశాలతో రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇంతకూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గుండె తెగువ ఏంటి..? రష్యన్ సేనలను అతితక్కువ రక్షణ వ్యవస్థతో ఎలా నిలువరిస్తున్నారు..?

ఎవరో వస్తారని ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. మహా కవి శ్రీశ్రీ రాసిన ఈ మాటలనే అక్షరాలా ఆచరణలో పెడుతున్నారు జెలెన్‌స్కీ. తమ దేశాన్ని చుట్టుముట్టిన రష్యన్ సేనలను ఒంటరిగానే ఎందుర్కొన్నారు. యుద్ధ విమానాలు బాంబులు కురిపిస్తున్నా, యుద్ధ ట్యాంకులు మోహరించినా, బుల్లెట్లు గుండెలను చీల్చినా వెన్నుచూపను, వెనుదిరగను అంటూ ముందుకు మునుముందుకు సాగారు. పౌరుల చేతికి ఆయుధాలిచ్చి శత్రు సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టారంటే అది ముమ్మాటికీ జెలెన్‌స్కీ ముందుండి నడిపించంతోనే సాధ్యమైందని చెప్పాలి.

అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? నటుడిగా మొదలై దేశాధ్యక్షడిగా ఎలా ఎదిగారు.? 1978 జనవరి 25న జెలెన్‌స్కీ జన్మించారు. బాల్యం నుంచీ యాక్టివ్‌గా ఉండే జెలెన్‌స్కీ.. 2000 సంవత్సరంలో కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు సినిమాలు, టీవీ షోల్లో నటించారు. క్వర్తల్ 95 నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలు, కార్టూన్లు, టీవీషోలను నిర్మించారు. ఓ టీవీషోలో ఉక్రెయిన్ అధ్యక్షుడి పాత్రలో నటించారు కూడా. ఈ క్రమంలోనే రష్యన్ కళాకారులను ఉక్రెయిన్ నుంచి బహిష్కరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన జెలెన్‌స్కీ 2014లో తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం 2018లో రాజకీయ పార్టీ స్థాపించి, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆరోజు నుంచి ఈరోజు వరకూ ఉక్రెయిన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తింది.

అధ్యక్షుడిగా నటించిన వ్యక్తి అదే దేశానికి అధ్యక్షుడిగా మారారు. ఇది యాధృచ్చికమే అయినా తనకు ఎదురైంది మాత్రం మామూలు సవాల్ కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్ధ్యాలున్న రష్యాతో యుద్ధం అంటే ఎవరైనా ఒక్కసారి ఆలోచిస్తారు.. కానీ జెలెన్‌స్కీ మాత్రం భయపడలేదు. తమకు అండగా ఉంటామన్నవారు వెనుకడుగు వేసినా యుద్ధంలో ఒంటరిగానే పోరాడారు. దేశ యువతకు ఆయుధాలిచ్చి మరీ ముందుండి నడిపించారు. ఉక్రేనియన్లలో ఎంతగా పోరాట పఠిమను నింపారంటే రష్యాన్ సేనలపై ఎవరిళ్లలో వాళ్లు సొంతంగా పెట్రోల్ బాంబులు తయారు చేసుకుని మరీ పోరాడేంతగా. ఉక్రేనియన్ల నుంచి ఇలాంటి ప్రతిఘటనలు బహుశా రష్యన్ సేనలు కూడా ఊహించి ఉండవేమో.

జెలెన్‌స్కీ ఒకే ఒక్క పిలుపుతో వేల మంది ఉక్రేనియన్లు రోడ్లపైకి వచ్చి యుద్ధం రంగంలో నిలిచారు. తమ దేశంలోకి చొచ్చుకొస్తున్న రష్యన్ సేనలను ఎక్కడికక్కడ నిలువరించేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయ లేదు. తాజాగా కీవ్‌వైపు దూసుకొస్తున్న రష్యా మిలటరీ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఒకటీ రెండూ కాదు పదుల సంఖ్యలో దూసుకొస్తున్న మిలటరీ వాహనాలను అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి మరీ అడ్డంగా నిలుచున్నాడు. ఆ వ్యక్తి చూపిన తెగువకు రష్యన్ మిలటరీకి సైతం కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. బులెట్‌లు కురిపించే అవకాశం ఉన్నా అతడి తెగువకు సెల్యూట్ చేసి వెళ్లిపోయింది. దేశంకోసం పోరాడాలన్న జెలెన్‌స్కీ పిలుపుతో ఇలా ఒక్కరూ ఇద్దరూ కాదు వేలాది మంది ఉక్రేనియన్లు రష్యన్ సేనలకు ఎదురు నిలిచారు.

రష్యన్ సేనలు కీవ్‌ను చుట్టుముట్టేయడంతో దేశం విడిచి వచ్చేయాలంటూ బైడెన్ పంపిన ఆహ్వానాన్నీ జెలెన్‌స్కీ తిరస్కరించారు. దేశ యువత యుద్ధ భూమిలోకి దిగి పోరాడుతుంటే తానెలా దేశం దాటుతానన్నారు. ఎట్టిరిస్థితుల్లోనూ ఉక్రెయిన్‌ను వీడి వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పారు. తనకు ఆయుధాలు కావాలని, పారిపోడానికి సాయం కాదని నిష్కర్షగా అమెరికాకు చెప్పారు. రష్యన్ సైన్యంతో కడవరకూ పోరాడుతా అన్నారు. తుది వరకూ యుద్ధ భూమిలో నిలిచే ఉంటానన్నారు. సాధారణ వ్యక్తిగా జీవితాన్ని మొదలు పెట్టి అసాధారణ శక్తిగా పోరాడుతున్న జెలెన్‌స్కీ చూపిన తెగువకు యావత్ ప్రపంచం రియల్ సోల్జర్ అంటూ సెల్యూట్ చేస్తోంది. భావితరాలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఒక టార్చ్ బేరర్‌గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News