హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై ట్రంప్ నిర్ణయం: ప్రవాస భారతీయుల తీవ్ర ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును $100,000 కు పెంచడంపై ప్రవాస భారతీయ సంస్థ ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం వల్ల కుటుంబాలు, కెరీర్‌లు ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోండి.
న్యూయార్క్: హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రవాస భారతీయ సంస్థ ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీసా ఫీజు పెంపు అనేది అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కాదని, ట్రంప్ తన విదేశీ వ్యతిరేకతను ఈ చర్య ద్వారా చాటుకుంటున్నారని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ అన్నారు.
ఈ గందరగోళ చర్యతో విదేశీయుల్లో భయాందోళనలు, గందరగోళం సృష్టించారని ఆయన విమర్శించారు. "ట్రంప్ నిర్ణయం ప్రభావం వెంటనే పడుతుంది. ఇది భారీ నష్టానికి దారి తీస్తుంది. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. కెరీర్‌లు గాడి తప్పుతాయి. కమ్యూనిటీలు అస్థిరపడతాయి" అని చింతన్ పటేల్ పేర్కొన్నారు. వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గొప్ప బలం అని, ఈ బలాన్ని బలోపేతం చేసే బదులు, ట్రంప్ వలస విధానాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన అన్నారు. ఈ నిర్ణయం వ్యాపారాలను అస్థిరపరిచి, ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని అభిప్రాయపడ్డారు.
హెచ్-1బీ వీసాదారులు అమెరికాకు వెన్నెముక
ప్రముఖ న్యాయవాది నవ్‌నీత్ చుగ్ కూడా ఈ నిర్ణయాన్ని ఖండించారు. హెచ్-1బీ వీసాదారులు అమెరికాకు వెన్నెముక వంటివారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీర్లను, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్న వృత్తి నిపుణులను అందిస్తూ, భారతదేశం అంతర్జాతీయ ప్రతిభకు ఒక ఫ్యాక్టరీగా ఉందని ఆయన చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని భారతీయ నిపుణులు అమెరికాలో పరిశోధన, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కొత్త సాంకేతికతలైన ఏఐ, క్వాంటమ్ వంటి వాటిలో అంతరాన్ని పూడుస్తున్నారని ఆయన తెలిపారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ చీఫ్ శంతను నారాయణ్ వంటి దిగ్గజాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారని, వీరంతా హెచ్-1బీ వీసాతో వచ్చినవారే అని నవ్‌నీత్ చుగ్ గుర్తు చేశారు. ఈ నిర్ణయం ప్రతిభను ప్రోత్సహించే బదులు, దానిని అడ్డుకుంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.