China population: తగ్గిపోతున్న యువత..చైనాను వెంటాడుతున్న జనాభా సంక్షోభం..!!

China population: తగ్గిపోతున్న యువత..చైనాను వెంటాడుతున్న జనాభా సంక్షోభం..!!

Update: 2026-01-20 01:41 GMT

China population: చైనాలో జనాభా తగ్గుదల తీవ్రతరం అవుతోంది. దేశంలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా జనాభా క్షీణత నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (NBS) విడుదల చేసిన 2025 అధికారిక గణాంకాల ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే దేశ జనాభా సుమారు 33.9 లక్షలు తగ్గింది. దీంతో మొత్తం జనాభా 140.5 కోట్లకు పరిమితమైంది. 1949లో ప్రజాస్వామ్య చైనా అవతరణ తర్వాత జననాల సంఖ్య ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఎన్‌బీఎస్ వివరాల ప్రకారం, 2025లో చైనాలో మొత్తం 79.2 లక్షల శిశువులు మాత్రమే జన్మించగా, అదే ఏడాది 1.13 కోట్ల మంది మృతి చెందారు. ప్రతి వెయ్యి మందికి జననాల రేటు 5.63గా నమోదైంది. ఇది 2024లో నమోదైన 95.4 లక్షల జననాలతో పోలిస్తే సుమారు 17 శాతం తగ్గుదలని సూచిస్తోంది. మరోవైపు మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 8.04కి చేరింది. ఇది 1968 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

జనాభా పెరుగుదల కోసం చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. పిల్లల పెంపకానికి ఆర్థిక సహాయం, పన్ను రాయితీలు వంటి సదుపాయాలను అందించినా, యువత కుటుంబ విస్తరణ వైపు ఆసక్తి చూపడం లేదు. జీవన వ్యయాలు పెరగడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, దేశంలో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 32.3 కోట్లకు చేరింది, ఇది మొత్తం జనాభాలో దాదాపు 23 శాతంగా ఉంది. అదే సమయంలో 16 నుంచి 59 ఏళ్ల మధ్య పనిచేసే వయసు గల వారి వాటా 60.6 శాతానికి తగ్గింది. ఈ పరిణామం భవిష్యత్తులో శ్రామిక శక్తి తగ్గుదలకు దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఈ గణాంకాలపై స్పందించిన ఎన్‌బీఎస్ అధికారి వాంగ్ పింగ్‌పింగ్ మాట్లాడుతూ, “చైనా జనాభా ఇప్పటికీ పరిమాణ పరంగా చాలా పెద్దదే. అదే సమయంలో జనాభా నాణ్యతలో మెరుగుదల కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. అయితే, తగ్గుతున్న జననాల రేటు మరియు పెరుగుతున్న వృద్ధుల సంఖ్య దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక భద్రతా వ్యవస్థలపై దీర్ఘకాలంలో గణనీయమైన ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News