Who is Nisha Verma: నిషా వర్మ ఎవరు? అమెరికా కాంగ్రెస్‌లో పురుష గర్భధారణ గురించి సంచలనం రేపిన మహిళ ప్రళ్నలు!
Who is Nisha Verma: భారతీయ-అమెరికన్ ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ నిషా వర్మ ఇటీవల అమెరికాలో పెద్ద చర్చకు కారణమయ్యారు.
Who is Nisha Verma: భారతీయ-అమెరికన్ ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ నిషా వర్మ ఇటీవల అమెరికాలో పెద్ద చర్చకు కారణమయ్యారు. గర్భస్రావ మాత్రల భద్రతపై అమెరికా సెనేట్‌లో జరిగిన ఆరోగ్యం, విద్య, కార్మిక, పెన్షన్ల కమిటీ విచారణ సందర్భంగా చోటుచేసుకున్న ఘాటు వాదనలు ఆమెను వార్తల్లోకి తీసుకువచ్చాయి. ఈ విచారణకు డెమోక్రటిక్ పార్టీ తరఫున సాక్షిగా హాజరైన నిషా వర్మను రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలే ఒక వివాదాస్పద ప్రశ్న అడిగారు. పురుషులు కూడా గర్భవతి కావచ్చా అని ఆయన ప్రశ్నించడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ప్రశ్నకు నేరుగా అవును లేదా కాదు అనే సమాధానం ఇవ్వకుండా, డాక్టర్ నిషా వర్మ ప్రశ్న ఉద్దేశాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్న చర్చను తప్పుదారి పట్టించేలా ఉందని, అసలు చర్చ ఏ దిశగా సాగుతుందో తనకు స్పష్టంగా అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రశ్న వెనుక ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కాలేదని చెప్పడంతో, సెనేటర్ హాలే, డాక్టర్ నిషా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాను కేవలం జీవశాస్త్ర సంబంధమైన వాస్తవాన్ని స్పష్టతకు తెచ్చేందుకే ప్రశ్న అడిగానని హాలే వివరణ ఇచ్చారు. ఈ సంభాషణతో సభలో తీవ్ర చర్చ సాగింది.
డాక్టర్ నిషా వర్మ ఒక ప్రముఖ భారతీయ-అమెరికన్ వైద్యురాలు. ఆమె ప్రస్తుతం ‘ఫిజీషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్’ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. నార్త్ కరోలినాలో భారతీయ వలస కుటుంబంలో జన్మించిన ఆమె, సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్. ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ నియంత్రణ అంశాల్లో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.
డాక్టర్ నిషా వర్మ జీవశాస్త్రం, మానవ శాస్త్రం, ప్రజారోగ్య రంగాల్లో పలు డిగ్రీలను సాధించారు. ప్రస్తుతం ఆమె ఎమోరీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. గర్భస్రావంపై విధించిన నిషేధాలకు ఆమె చాలా కాలంగా వ్యతిరేకంగా నిలుస్తూ, శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిన ఆరోగ్య సంరక్షణకు మద్దతుగా వాదిస్తున్నారు. ఈ అంశాలపై అమెరికా అంతటా వైద్యులకు అవగాహన కల్పిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణ కోసం చురుకుగా పనిచేస్తున్నారు.