Balwinder Singh Sahni: దుబాయ్ లో భారత బిలియనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష..ఏం జరిగిందంటే?
Balwinder Singh Sahni: దుబాయ్ లో భారత బిలియనీర్ కు ఐదేళ్ల జైలు శిక్ష..ఏం జరిగిందంటే?
Money laundering: దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన భారతీయ బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆయన దోషిగా తేలడంతో దుబాయ్ కోర్టు 5ఏళ్లు జైలు శిక్ష విధించింది. రూ. కోటి జరిమానాతో పాటు ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశించింది. అంతేకాదు..శిక్ష పూర్తయిన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలంటూ తీర్పును వెలువరించింది.
ఆర్ఎస్జీ ప్రాపర్టీ డెవలప్ మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ అయిన బల్వీందర్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు వచ్చాయి. షెల్ కంపెనీలు, ఫోర్జరీ ఇన్ వాయిస్ లతో 150 మిలియన్ దిర్హమ్స్ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2024లో బల్వీందర్, మరికొందరిపై కేసు నమోదు అయ్యింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆర్థిక మోసాలకు పాల్పడటం నిజమేనని తేలింది. అనంతరం బల్వీందర్ తోపాటు ఇతర నిందితులను కూడా దోషులుగా తేల్చుతూ దుబాయ్ ఫోర్త్ క్రిమినల్ కోర్టు తీర్పును వెలువరించింది.
కాగా బల్వీందర్ కు 5ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. 5 లక్షల దిర్హమ్స్ జరిమానా విధించింది. ఆర్థిక నేరాలకు పాల్పడినందుకు గాను బిలియనీర్ నుంచి 150 మిలియన్ దిర్హమ్స్ విలువైన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. శిక్ష పూర్తి అయిన తర్వాత బల్వీందర్ ను దేశం నుంచి పంపించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో శిక్ష పడిన ఇతర నిందితుల్లో ఈ బిలియనీర్ తన పెద్ద కొడుకు కూడా ఉన్నాడు.
53ఏళ్ల బల్వీందర్ రాస్ సాహ్ని గ్రూప్ పేరుతో ప్రాపర్టీ డెవలప్ మెంట్ కంపెనీని నెలకొల్పాడు. ఈ కంపెనీ యూఏఈతోపాటు అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఈయనకు దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఖరీదైన భవనాలు, వాణిజ్య భవనాలు, ఇతర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల సముదాయాలు, ఫైవ్ స్టార్ హోటల్ వంటి ఆస్తులు ఎన్నో ఉన్నాయి. దుబాయ్ ఎలైట్ సర్కిల్ లో అబు సబాహ్ గా పేరొందారు. లగ్జరీ కార్లంటే ఇష్టపడే బల్వీందర్ కొత్త కార్లను కొనుగోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. 2016లో తన రూల్స్ రాయిస్ కార్ కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హమ్స్ తో నెంబర్ ప్లేట్ కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కారు.