ట్రంప్ స్వోత్కర్షకు గ్రహణం : ఇస్కఫ్
ఎనిమిది ప్రపంచ యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో మరో రెండు చోట్ల యుద్ధాలు మొదలయ్యాయని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర అధ్యక్షులు కాగితాల రాజశేఖర్ విమర్శించారు.
విజయవాడ: ఎనిమిది ప్రపంచ యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో మరో రెండు చోట్ల యుద్ధాలు మొదలయ్యాయని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర అధ్యక్షులు కాగితాల రాజశేఖర్ విమర్శించారు. విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఇస్కఫ్ రాష్ట్ర సమితి సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, థాయిలాండ్- కంబోడియా, కాంగో-రువాండా ల మధ్య రెండు నెలల క్రితం నుంచి యుద్ధాలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అధికారం కోసం జాతీయవాద ధోరణులను రెచ్చగొట్టటం వల్ల కూడా ఆయా దేశాల్లో ఉద్రిక్తత ఏర్పడుతుందని రాజశేఖర్ అన్నారు.
ఈ నెల మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన భారత్–రష్యాల మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. పుతిన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య రాజకీయ, రక్షణ, ఆర్థిక, ఇంధన రంగాల్లో కీలక చర్చలు జరిగాయనీ, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో భారత్–రష్యాల స్నేహబంధం ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేసిందని రాజశేఖర్ వివరించారు.
ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు బొల్లిముంత శ్రీకృష్ణ మాట్లాడుతూ శాంతి, పరస్పర గౌరవం, స్వతంత్రత ఆధారంగా ప్రపంచ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజాభిప్రాయాన్ని ప్రోది చేయాలనీ, ఇందుకు ఇస్కఫ్ తన కృషిని మరింత విస్తృతం చేయాలన్నారు. ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు ప్రజాసంస్కృతి, నైతిక విలువలను కాపాడే ఉద్యమాల్లో ఇస్కఫ్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో వామపక్ష అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో అమెరికా నావికాదళాన్ని వెనిజులా తీర ప్రాంతాల్లో మోహరించడాన్ని నరసింహులు తీవ్రంగా ఖండించారు. ఏ దేశంపైన అయినా యుద్ధం మోపే ముందు దుష్ప్రచారాన్ని తన మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం అమెరికా సామ్రాజ్యవాదపు సాధారణ వ్యూహమని అన్నారు.
ఇస్కఫ్ మరో ప్రధాన కార్యదర్శి తుంగ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ఇటీవల న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో వామపక్ష భావజాలానికి చెందిన జోహ్రాన్ మందానీ విజయం సాధించడం సామ్రాజ్యవాద, కార్పొరేట్ శక్తులకు గట్టి ఎదురుదెబ్బ అన్నారు. ఇస్కఫ్ రాష్ట్ర కోశాధికారి కాండ్రేగుల సత్యాంజనేయ నయా ఉదారవాద విధానాల ఫలితంగా నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుండగా, కార్మిక వర్గానికి దక్కుతున్న నిజ వేతనాలు తగ్గిపోతున్నాయని, కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులు హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కార్యదర్శి కృష్ణబాబు ప్రజాకళలు, సంస్కృతి పరిరక్షణ కోసం ఇస్కఫ్ చేస్తున్న కృషికి తమ సంస్థ, కళాకారులు ఎప్పుడు పిలిచినా వస్తారని తెలిపారు.
నెల్లూరు జిల్లా ఇస్కఫ్ నాయకులు రమేష్, దయాశంకర్రావు, చంద్రమూర్తి, ఇస్కఫ్ విశాఖ జిల్లా నాయకులు మధుమతి, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి ప్రియాంక లహరి, తిరుపతి నాయకులు, డి.రామచంద్రయ్య, గోవిందస్వామి రెడ్డి, మదనపల్లి నుంచి జి.వి. శివకుమార్, అనంతపూర్ నుంచి వసంతబాబు, ఏలూరు జిల్లా నుంచి కడుపు కన్నయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్ష్మి గణపతి, ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు పరుచూరి అజయ్ కుమార్, బుద్దారపు వెంకటరావు, యడ్ల కృష్ణ కిషోర్, పలనాడు జిల్లా ఇస్కఫ్ కార్యదర్శి చెన్నకేశవరావు, గుంటూరు జిల్లా నాయకులు గోలి సీతారామయ్య తదితరులు జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాలను వివరించగా, సమావేశం సమీక్షించింది. సమావేశానికి ముందు కమ్యూనిస్టు ఉద్యమంలో విజయవాడ పై చెరగని ముద్ర వేసిన పోట్రు వెంకటేశ్వరరావు, ప్రముఖ కవి అందెశ్రీ, ఆపరేషన్ కగార్ లో అమరులైన హిడ్మా, ఆయన సతీమణి రాజే తదితరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఇస్కఫ్ క్యాలెండరు ఆవిష్కరణ
ఇస్కఫ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమితి ప్రచురించిన నూతన సంవత్సరం క్యాలెండరు -2026ను నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వియన్నారావు ఆవిష్కరించారు. యుద్ధాల ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని, శాంతి, పరస్పర గౌరవం, సంప్రదింపుల ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రొఫెసర్ వియన్నారావు అన్నారు. భవిష్యత్ తరాల కోసం యుద్ధరహిత, విషరహిత భూమి అవసరమని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఇందుకోసం కృషి చేస్తున్న ఇస్కఫ్ కార్యకలాపాలు మరింతగా జరగాలని, ప్రజలను చైతన్య పరచాలని కోరారు.
ఇస్కఫ్ కార్యదర్శి, విశాలాంధ్ర దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ కూన అజయ్ బాబు ఇస్కఫ్ కార్యకలాపాలు చురుకుగా జరుగుతున్నాయని జిల్లా నాయకులను అభినందించారు. ఇస్కఫ్ రాష్ట్ర నాయకులు ఆర్. పిచ్చయ్య, కృష్ణబాబు, అరుణోదయ శ్రీనివాస్ అభ్యదయ గీతాలు పాడారు. ఇస్కఫ్ రాష్ట్ర సీనియర్ నాయకులు జెవి ప్రభాకర్ మన దేశంలో వున్న వివిధ సంస్కృతులపై నిపుణులతో వర్కుషాపులు అన్ని జిల్లాలో పెట్టి ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణానికి ఇస్కఫ్ చొరవ చూపాలని కోరారు. ఇస్కఫ్ విశాఖ జిల్లా నాయకురాలు ప్రియాంక లహరి అతిధులను వేదిక పైకి ఆహ్వానించగా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కాగితాల నిర్మల వందన సమర్పణ చేశారు. సమావేశం మధ్యలో తెనాలి నుంచి వచ్చిన చిన్నారి గగనశ్రీ, మౌనిక చేసిన నృత్యాలు అలరించాయి. గగనశ్రీ తల్లి కంతేటి వరలక్ష్మిని మాజీ వైఎస్ ఛాన్సలర్ డాక్టర్ వియన్నారావు దుశ్శాలువతో సత్కరించారు.