Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు: ఎన్నికలకు రెండు రోజుల ముందు హిందూ వ్యాపారి దారుణ హత్య!

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఫిబ్రవరి 12న ఆ దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో, మరో హిందువు హత్యకు గురవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-02-10 11:39 GMT

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. ఫిబ్రవరి 12న ఆ దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో, మరో హిందువు హత్యకు గురవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మిమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణం స్థానిక హిందువులను భయాందోళనకు గురిచేస్తోంది.

దుకాణంలో ఉండగానే కత్తులతో దాడి

పోలీసుల కథనం ప్రకారం.. మిమెన్‌సింగ్ జిల్లాకు చెందిన సుసేన్ చంద్రశేఖర్ (62) అనే హిందూ వ్యాపారి సోమవారం రాత్రి తన బియ్యం దుకాణంలో పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా లోపలికి చొరబడి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చంద్రశేఖర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నిందితుల చాకచక్యం.. భయానక వాతావరణం

చంద్రశేఖర్ మరణించాడని నిర్ధారించుకున్న నిందితులు, ఎవరికీ అనుమానం రాకుండా దుకాణం షట్టర్‌ను బయటి నుంచి మూసివేసి పరారయ్యారు. ఎంతసేపటికీ ఆయన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుకాణం వద్దకు వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

ఎన్నికల ముందు ఆందోళన

మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హత్య జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మైనార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయోత్పాతం సృష్టించేందుకే ఈ దాడులు జరుగుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని భారత్ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News