Stock Market crash : కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 1,600 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. కారణాలివే!

Stock Market crash : భారత స్టాక్ మార్కెట్లకు ఈ శుక్రవారం 'బ్లాక్ ఫ్రైడే'గా మారింది. సెన్సెక్స్ ఏకంగా 1,625 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 22,900 స్థాయిని కోల్పోయింది.

Update: 2026-03-27 10:36 GMT

Stock Market crash : కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 1,600 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్.. కారణాలివే!

Stock Market crash : అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. నిజానికి భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఈ శుక్రవారం 'బ్లాక్ ఫ్రైడే'గా మారింది. ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ రోజు మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ 2 శాతం కంటే ఎక్కువ నష్టపోయాయి. ఈ మార్కెట్ పతనానికి సంబంధించిన పూర్తి కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..

ఈ రోజు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,625.58 పాయింట్లు (2.16%) నష్టపోయి 73,647.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 467.40 పాయింట్లు (2.01%) పడిపోయి 22,839.05 వద్దకు చేరుకుంది. నేడు మార్కెట్‌లో కేవలం 708 షేర్లు లాభపడగా, 3,315 షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు బాగున్నాయని చెబుతున్నప్పటికీ, అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ ఇరాన్ తిరస్కరించింది. దీనికి తోడు మధ్యప్రాచ్యానికి అదనంగా 10,000 మంది సైనికులను అమెరికా పంపనుందన్న వార్తలు మార్కెట్లో ఆందోళనను పెంచాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. చమురు ధరలు పెరగడం వల్ల భారత్ వంటి దిగుమతి దేశాలపై భారం పడుతుందనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. గత రెండు సెషన్లలో మార్కెట్ 3.5% పెరగడంతో, ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఈ రోజు మొత్తం 16 ప్రధాన రంగాలలో 15 రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా 94.7 స్థాయికి పడిపోయింది. చమురు సంక్షోభం దిగుమతి బిల్లును పెంచుతుందనే ఆందోళనలే ఇందుకు కారణం అయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు మార్కెట్లో నిఫ్టీ 50లో కేవలం ONGC (4.7%) మాత్రమే టాప్ గెయినర్‌గా నిలిచింది. చమురు ధరలు పెరగడం దీనికి కలిసొచ్చింది. టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ షేర్లు 1 నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు కూడా భారీగా దెబ్బతిన్నాయి. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ షేర్లు 3% నష్టపోయాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపైనే మార్కెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ఇండియా VIX (వోలటైలిటీ ఇండెక్స్) 7.5% పెరిగి 26.53 వద్ద ఉండటం చూస్తుంటే, రానున్న రోజుల్లో కూడా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News