Israel-Iran War :ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు..అణు కేంద్రాలే టార్గెట్
Israel-Iran War: అమెరికా హెచ్చరికలను కాదని ఇరాన్ అణు కేంద్రాలైన అరాక్, అర్ధకాన్ ప్లాంట్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది.
Israel-Iran War :ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు..అణు కేంద్రాలే టార్గెట్
Israel Attacks Iran: ఇరాన్ , ఇజ్రాయెల్ దేశాల మధ్య రాజుకున్న చిచ్చు ఇప్పుడు అగ్రరాజ్యాల హెచ్చరికలను దాటి, అణు కేంద్రాల ముంగిట నిలిచింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత గాఢంగా కమ్ముకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ అటామిక్ షీల్డ్' ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చాలా కాలంగా ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవాలని చూస్తున్న ఇజ్రాయెల్, ఇప్పుడు ఏకంగా ఆ దేశపు గుండెకాయ వంటి అణు కేంద్రాలపై విరుచుకుపడింది. అమెరికా వంటి మిత్రదేశాలు సంయమనం పాటించాలని కోరినప్పటికీ, తన భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్పష్టం చేశాయి.
ప్రధాన లక్ష్యాలు ఇవే:
ప్లుటోనియం ఉత్పత్తికి కీలకమైన అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ కేంద్రాన్ని ధ్వంసం చేయడం ద్వారా ఇరాన్ అణ్వాయుధ కలలను దెబ్బకొట్టాలని ఇజ్రాయెల్ భావించింది.యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలక పాత్ర పోషించే అర్ధకాన్ యురేనియం ప్లాంట్‌పై జరిగిన వైమానిక దాడులు ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను ఛిన్నాభిన్నం చేశాయి. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకోవడమే మా ప్రాథమిక లక్ష్యం. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్ఫ్రాను మేము విజయవంతంగా టార్గెట్ చేశాము అని ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
రేడియేషన్ ముప్పు లేదు.. కానీ
ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ దేశ అణు శక్తి సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. దాడులు జరిగిన మాట వాస్తవమేనని, అయితే ప్లాంట్ల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఉండటం వల్ల రేడియేషన్ ముప్పు ఏమీ లేదని స్పష్టం చేశారు. అలాగే, ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమికంగా వెల్లడించారు. కానీ, తమ గడ్డపై జరిగిన ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇజ్రాయెల్ చేసిన ఈ దుశ్చర్యకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఇరాన్ అత్యున్నత నాయకత్వం హెచ్చరించింది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ విసిరింది.
ప్రపంచ దేశాల్లో ఆందోళన
ఈ దాడులతో మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదా అన్న భయం నెలకొంది.ఇజ్రాయెల్‌ను వెనక్కి తగ్గాలని సూచించినప్పటికీ, దాడులు జరగడం బైడెన్ యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడే అవకాశం ఉంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఇరు దేశాలు శాంతిని పాటించాలని, అణు కేంద్రాలపై దాడులు మానవాళికి ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది.
యుద్ధమా? శాంతియా?
ఇప్పటికే లెబనాన్, గాజా మొనల్లో పోరాడుతున్న ఇజ్రాయెల్, ఇప్పుడు నేరుగా ఇరాన్‌తో కయ్యానికి దిగడం ద్వారా ఈ ప్రాంతాన్ని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్'కు తీసుకెళ్లింది. ఇరాన్ వైపు నుండి ఎలాంటి ప్రతీకార దాడులు జరుగుతాయనే దానిపైనే ఇప్పుడు ప్రపంచం దృష్టి ఉంది. ఒకవేళ ఇరాన్ గనుక క్షిపణి దాడులకు దిగితే, అది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగిలిపోదు.. మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.