Isreal-Hamas: అంధకారంలో గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి.. ఐసీయూలో చనిపోతున్న రోగులు
Isreal-Hamas: జనరేటర్ నిలిచిపోవడంతో చనిపోయిన చిన్నారి
Isreal-Hamas: ఉత్తర గాజాలో భీకరంగా భూతల దాడులు సాగిస్తున్న ఇజ్రాయెల్ దళాలు.. ఈ ప్రాంతంలోని అతిపెద్ద అల్ షిఫా ఆసుపత్రి చుట్టుముట్టాయి. హాస్పిటల్ వద్ద హమాస్ ఉగ్రవాదులతో ఐడీఎఫ్ తీవ్రంగా పోరాడుతోంది. బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో అల్ షిఫా ఆస్పత్రి అంధకారంలో చిక్కుకుపోయిందని వైద్యులు వెల్లడించారు. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోవడంతో ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అల్ షిఫా ఆసుపత్రి వద్ద వేల మంది పౌరులున్నారని, హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఈ ఆసుపత్రి కింద ఉందని, దానిని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఇటీవల వెల్లడించింది. ఇక్కడ సామాన్య పౌరులను హమాస్ మానవ కవచాలుగా వాడుకుటోందని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి వద్ద దాడులను మరింత పెంచింది. దీంతో హాస్పిటల్లో తలదాచుకున్న పౌరులు తీవ్ర భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.