Donald Trump : 48 గంటల్లో హోర్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలి..లేకపోతే బూడిద చేస్తానంటూ ట్రంప్ వార్నింగ్
Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. హోర్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని, దేశాన్ని చీకటిలోకి నెట్టేస్తామని హెచ్చరించారు.
Donald Trump
Donald Trump : ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన మలుపు తిరిగింది. గడిచిన మూడు వారాలుగా సాగుతున్న ఈ పోరులో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ విధించారు. ఒకవైపు క్షిపణుల వర్షం, మరోవైపు చమురు సంక్షోభంతో అల్లాడుతున్న ప్రపంచానికి ట్రంప్ ఇచ్చిన తాజా వార్నింగ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. 48 గంటల్లో ఇరాన్ దారికి రాకపోతే ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అయ్యే అత్యంత కీలకమైన మార్గం హోర్ముజ్ జలసంధి. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ సేనలు ఈ దారిని పూర్తిగా మూసివేశాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఐదు వంతు చమురు సరఫరా ఆగిపోయింది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఘాటుగా స్పందించారు. 48 గంటల్లోగా ఆ దారిని తెరవకపోతే, ఇరాన్‌లోని ప్రధాన పవర్ ప్లాంట్లపై దాడులు చేసి వాటిని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు.
అమెరికా పవర్ ప్లాన్.. ఇరాన్ అంధకారంలోకి?
ట్రంప్ హెచ్చరికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. "మేము దాడులు మొదలుపెడితే అది ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ నుంచే ప్రారంభమవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన సైనిక చర్యలతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని, దీనిని అమెరికా చూస్తూ ఊరుకోదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పటిదాకా ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్‌పై సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ప్రయోగిస్తుండటంతో, ఈ యుద్ధం మధ్యప్రాచ్యం దాటి ఇతర దేశాలకు కూడా పాకే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రపంచ మార్కెట్ల ఆందోళన
ఇరాన్ చర్యల వల్ల ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే ఈ ఒత్తిడిని తగ్గించడానికి అమెరికా ఒక తెలివైన ఎత్తుగడ వేసింది. ప్రస్తుతం నౌకల్లో లోడ్ అయి ఉన్న ఇరాన్ చమురుపై ఆంక్షలను తాత్కాలికంగా తొలగించింది. దీనివల్ల దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా ధరల పెరుగుదలకు కొంత బ్రేక్ పడుతుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
యుద్ధం ఎటు వైపు? 22 దేశాల హెచ్చరిక
హోర్ముజ్ జలసంధి మూసివేతపై ఇప్పటికే 22 దేశాలు ఇరాన్‌ను హెచ్చరించాయి. అయినా ఇరాన్ మాత్రం తన మొండివైఖరిని వీడటం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ కుమారుడు మొజ్తబా ఖమేనీ మాత్రం తాము విజయం సాధించామని ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా, ట్రంప్ విధించిన 48 గంటల గడువు ముగిస్తే ఏం జరుగుతుందో అన్న భయం ఇప్పుడు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది.