ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు భార్యతో జెలెన్‌స్కీ.. మస్క్ ట్వీట్ వైరల్

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంత భీకర యుద్ధం నడుస్తోంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్యతో కలిసి ఏం చేశారో తెలుసా?

Update: 2025-02-22 07:24 GMT

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య భార్యతో జెలెన్‌స్కీ ఏం చేశారో చూడండని మస్క్ ట్వీట్

Volodymir Zelensky's wife Olena Zelensky's cover page story on Vogue: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం మొదలై మూడేళ్లు దాటింది. రెండు వైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఫిబ్రవరి 13 నాటికి ఉక్రెయిన్ అధికారిక లెక్కల ప్రకారం రష్యా సైనికులు, ఉక్రెయిన్ సైనికులు, ఉక్రెయిన్ పౌరులు కలిపి మొత్తం 1,48,359 మంది చనిపోయారు. అందులో 46000 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ చెప్పారు. మరో 3 లక్షల 90 వేల మంది యుద్ధంలో గాయపడినట్లు ఆయనే ప్రకటించారు.

అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంత భీకర యుద్ధం నడుస్తోంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్యతో కలిసి ఏం చేశారో తెలుసా అంటూ ఎలాన్ మస్క్ ఓ ట్వీట్ చేశారు. ఓవైపు యుద్ధంలో పిల్లలు చనిపోతుంటే మరోవైపు జెలెన్ స్కీ చేసిన పని ఇదని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో వోగ్ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజ్ ఫోటోతో కూడిన డైలీ మెయిల్ వార్తా కథనాన్ని జత చేశారు. ఎలాన్ మస్క్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఇంతకీ ఎలాన్ మస్క్ చేసిన ఆ ట్వీట్‌లో ఏముందనేది ఇప్పుడు చూద్దాం. జెలెన్‌స్కీ, ఆయన భార్య, ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు అయిన ఒలెనా జెలెన్ స్కీ గురించి డైలీ మెయిల్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ రాసిన ఒక వార్తా కథనం అది. ఓవైపు రష్యాతో ఉక్రెయిన్ భీకర యుద్ధం చేస్తోంటే మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్‌స్కీ వోగ్ మ్యాగజైన్ కవర్ ఫోటోకు ఫోజులిచ్చారు అనేది ఆ వార్తా కథనం.

ఇదే విషయమై మరో ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్... అందులో జెలెన్‌స్కీపై పలు విమర్శలు చేశారు. "ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక నియంత" అని అన్నారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరిగితే జెలెన్‌స్కీ దారుణంగా ఓడిపోతారని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు కనుకే ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారని మస్క్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా చేసి మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారని మస్క్ ఆరోపించారు.

కాన్‌స్టాంటిన్ కిసిన్ అనే రచయిత జెలెన్‌స్కీని వెనకేసుకొస్తూ ఒక ట్వీట్ చేశారు. "జెలెన్‌స్కీ ప్రతిపక్షాలను తొక్కిపెట్టలేదని, అందులో ఎవరైతే రష్యాకు మద్దతుగా ఉన్నారో వారిపై మాత్రమే నిషేధం విధించారు" అని కిసిన్ ట్వీట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ కూడా ఫాసిస్ట్ బ్రిటీష్ యూనియన్‌ను అలాగే నిషేదించిందని గుర్తుచేశారు.

కిసిన్ చేసిన ఈ ట్వీట్‌కు ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ జెలెన్‌స్కీ చేసే పనులకు ప్రజా ఆమోదం ఉందనుకుంటే ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు. లేదంటే ఆయన నియంత కిందకే వస్తారని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగనంత వరకు, మీడియాను స్వేచ్ఛ ఇవ్వనంత వరకు జెలెన్‌స్కీ చేసే పనులకు ప్రజామోదం ఉందని చెప్పకూడదని మస్క్ మరో ట్వీట్ చేశారు.

2019 లో వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ ఉక్రెయిన్ ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలు కూడా రష్యాకు అనుకూలంగా పనిచేస్తున్నాయనే కారణంతో జెలెన్ స్కీ ఆ ఎన్నికలను వాయదా వేశారు.

అమెరికా ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మస్క్ ఉక్రెయిన్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడంలో ఎలాంటి సందేహం లేదని జెలెన్‌స్కీ మద్దతుదారులు అంటున్నారు. రష్యాకు అనుకూలంగా వ్యవహరించడం కోసమే మస్క్ ఇలా జెలెన్‌స్కీకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనేది వారు చెబుతున్న వాదన.

Tags:    

Similar News