Donald Trump: నోబెల్ రాకపోతే నాకేంటి? ఇక 'శాంతి' గురించి ఆలోచించను..!!

Donald Trump: నోబెల్ రాకపోతే నాకేంటి? ఇక 'శాంతి' గురించి ఆలోచించను..!!

Update: 2026-01-20 02:27 GMT

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడానికి నార్వే ప్రభుత్వమే కారణమని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రధాని జోనస్ గార్ స్టోర్‌కు ఘాటు సందేశం పంపినట్లు సమాచారం. తాను ఎనిమిది కంటే ఎక్కువ యుద్ధాలను ఆపేందుకు కీలక పాత్ర పోషించానని, అయినప్పటికీ నోబెల్ బహుమతిని ఇవ్వకూడదని నార్వే నిర్ణయించుకుందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఇకపై ప్రపంచ శాంతి అంశాలపై తాను బాధ్యత తీసుకునే అవసరం లేదని, తన దృష్టి పూర్తిగా అమెరికా జాతీయ ప్రయోజనాలపైనే ఉంటుందని ఆ సందేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్ సంయమనం పాటిస్తూ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతి ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైన నోబెల్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, ఆ ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలోనే ట్రంప్‌కు వివరించినట్లు కూడా ఆయన గుర్తుచేశారు.

ఈ వివాదానికి గ్రీన్‌లాండ్ అంశమే ప్రధాన కారణంగా మారింది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తీసుకురావాలన్న ట్రంప్ ఆలోచనల నేపథ్యంలో, డెన్మార్క్‌పై ఒత్తిడి తేవాలని నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలను ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సహకరించని దేశాలపై ఫిబ్రవరి నుంచి అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

ప్రపంచ భద్రత కోణంలో గ్రీన్‌లాండ్ అమెరికా నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. రష్యా, చైనా వంటి దేశాల నుంచి గ్రీన్‌లాండ్‌ను రక్షించే సామర్థ్యం డెన్మార్క్‌కు లేదని ఆయన అభిప్రాయం. ఈ పరిణామాల నేపథ్యంలో నాటో సభ్యదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News