ప్రశ్నిస్తే తోలు తీస్తా, తాట తీస్తా అంటున్నారు: జగన్

Update: 2018-01-06 10:03 GMT

నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయటమే తన లక్ష్యమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం పుంగనూర్‌ నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన మైనార్టీల సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాబోయే ప్రజా ప్రభుత్వంలో ముస్లింల కోసం సబ్‌ ప్లాన్‌ తీసుకొస్తామన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కో పేజీలో ఒక్కో కులానికి హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తర్వాత అందర్నీ దగా చేశారని విమర్శించారు. పైగా ప్రశ్నించిన వ్యక్తులను 'తోలు తీస్తా, తాట తీస్తా' అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

ముస్లింల కోసం సబ్ ప్లాన్ తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇమామ్ లకు రూ. 10 వేలు, మౌసమ్ లకు రూ. 5 వేలు అందజేస్తామని చెప్పారు. పేద మైనార్టీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో మార్పులను తీసుకొస్తామని... ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నవారికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని... ఆపరేషన్ తర్వాత రెస్ట్ పీరియడ్ లో డబ్బులు అందజేస్తామని చెప్పారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి రూ. 10 వేల పెన్షన్ అందిస్తామని తెలిపారు. చిన్న పిల్లల చదువుకు భరోసా ఇవ్వడమే అసలైన ప్రేమ అని... ఆ ప్రేమను తాను అందిస్తానని జగన్ అన్నారు. వారిని చదివించడమే కాకుండా, ఖర్చుల కోసం రూ. 20 వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.

Similar News