వైసీపీ నేతలకు డెడ్‌లైన్ విధించిన జగన్

Update: 2018-10-07 07:30 GMT

డిసెంబరు డెడ్‌లైన్.. ఎలాంటి సమస్యలున్నా మీరే పరిష్కరించుకోండి. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయండని పార్టీ శ్రేణులను ఆదేశించారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. తన ఆదేశాలను లైట్‌గా తీసుకుంటే నేను కూడా అలాగే మిమ్మల్ని లైట్‌గా తీసుకోవాల్సి వస్తుందని నేతలను హెచ్చరించారు. దీంతో ఉరుకులు, పరుగులు పెడుతున్నారు వైసీపీ నేతలు. 

ఇప్పటిదాకా నియోజవర్గాల్లో ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ తాజాగా నేతలకు టార్గెట్‌లు విధించారు. నవంబరు చివరినాటికి జగన్ పాదయాత్ర ముగుస్తుండటంతో డిసెంబరు నాటికి నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు డెడ్‌లైన్ విధించారు జగన్. 

ప్రస్తుతం మెజార్టీ నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విబేధాలు తీవ్రమయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీ టికెట్‌ ఆశిస్తుండటం మరింత తలనొప్పిగా మారింది. చాలా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జి ఒకరుంటే వారికి వ్యతిరేకంగా రెండు, మూడు బ్యాచ్‌లు ఉంటున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నేతలు వర్గపోరు కారణంగా అధిష్టానం ఆదేశాలను సక్రమంగా అమలు చేయడం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. 

ఈ నేపథ్యంలో పార్టీని చక్కదిద్దేందుకు అధినేత జగన్ దృష్టిసారించారు. డిసెంబరు చివరి నాటికి అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని జగన్ ఆదేశించారు. అందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చి విబేధాల్లేకుండా చూడాలని చూడాలని సూచించారు. లేకుంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని జగన్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పార్టీ నేతలంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మరి నియోజకవర్గాల్లో ఉన్న విబేధాలను ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి. 

Similar News