21 న రాష్ట్ర వ్యాప్త ప‌ల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి

ఈనెల 21న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసిన‌ట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

Update: 2025-12-20 13:26 GMT

అమ‌రావ‌తి: ఈనెల 21న ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసిన‌ట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ జి.వీర‌పాండియ‌న్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఉండ‌వ‌ల్లి క్యాంప్ కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కాకినాడ ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రంలో వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్ల‌ల్లంద‌రికీ పోలియో చుక్క‌ల్ని త‌ప్ప‌కుండా వేయించాల‌న్న‌ కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 54,07,663 మంది 5 ఏళ్ల లోపు పిల్లలకు 38,267 బూత్ లలో పోలియో చుక్క‌లు వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసిన‌ 98,99,300 డోస్ ల‌ను ఇప్ప‌టికే అన్ని జిల్లాల‌కు పంపించామ‌ని తెలిపారు. ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు అన్ని జిల్లాల‌కు నోడ‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మించామ‌న్నారు.

ప‌ల్స్ పోలియోను విజ‌య‌వంతం చేయాలిః మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్

ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగే ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపునిచ్చారు. త‌మ పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేయించేందుకు త‌ల్లిదండ్రులు ముందుకొచ్చి భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. వైద్య శాఖ అధికారులు, సిబ్బందికి స‌హ‌క‌రించాల‌న్నారు.

2014, మార్చినాటికి భార‌త్‌ పోలియో ర‌హిత దేశంగా వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైనేష‌న్‌( WHO ) ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. అయితే, పాకిస్తాన్‌, ఆఫ్గ‌నిస్తాన్ దేశాల్లో ఇంకా పిల్ల‌ల‌పై వైల్డ్ పోలియో వైర‌స్ వ్యాప్తి ప్ర‌భావం ఉండొచ్చ‌న్న ఉద్దేశంతో ప్ర‌పంచ వ్యాప్తంగా దీని నిర్మూల‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఆఫ్గ‌నిస్తాన్ నుంచి ఈ వైర‌స్ అక్టోబ‌ర్,2025లో జ‌ర్మ‌నీకి వ్యాప్తి చెందింది. ఇక మ‌న రాష్ట్రం విష‌యానికొస్తే 2008, జులైలో ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో చివ‌రి పోలియో కేసు న‌మోదైంది. భారత్ ను పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ఇండియా ఎక్స్‌పెర్ట్ అడ్వ‌యిజ‌రీ గ్రూప్‌(IEAG) చేసిన సిఫార‌సుల మేర‌కు 1995 నుంచి నేష‌నల్‌ ఇమ్యునైజేష‌న్ డే((ప‌ల్స్ పోలియో దినం) కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు.

Tags:    

Similar News