మార్పులతో పార్టీకి కొత్త తలనొప్పులు...విజయవాడ ఈస్ట్ అండ్‌ వెస్ట్‌కి తగిలిన సెగ

Update: 2018-09-20 05:21 GMT

సర్వేలు, సమీకరణాలు అంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను మార్చడం వైసీపీలో గందరగోళానికి దారితీస్తోంది. కృష్ణాజిల్లాలో తాజాగా జరిగిన నాయకత్వ మార్పు పార్టీ నేతలను అయోమయంలోకి నెట్టింది. విజయవాడ సెంట్రల్‌లో రాజుకున్న నిప్పు ఇప్పుడు జిల్లా మొత్తం అంటుకుంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ ఇన్‍ఛార్జులను మార్చే పని మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చిన రాజధాని ప్రాంతమైన కృష్ణాజిల్లా నుంచి ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.

అయితే కృష్ణాజిల్లాలో చేపట్టిన నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చాయి. విజయవాడ సెంట్రల్‌తో మొదలైన లొల్లి ఈస్ట్‌, వెస్ట్‌కి కూడా తాకింది. సెంట్రల్‌ బాధ్యతల్ని మల్లాది విష్ణుకి అప్పగించడంతో వంగవీటి రాధా అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వంగవీటికి ఈస్ట్‌ సీట్‌ కేటాయిస్తామని చెబుతుండటంతో ప్రస్తుతం అక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యలమంచిలి రవి అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్‌లోనూ నాయకత్వ మార్పునకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. వెల్లంపల్లిని తప్పించి పోతిన ప్రసాద్‌‌ను నియమిస్తారనే టాక్‌ నడుస్తోంది. విజయవాడలో పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలోని మరో రెండు మూడు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి మార్పులే చోటు చేసుకున్నాయి. పెడనలో మొన్నటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉప్పాల రామ్‌ప్రసాద్‌ను తప్పించి జోగి రమేష్‌కి అప్పగించారు. అలాగే అవనిగడ్డ ఇన్‍ఛార్జ్‌ సింహాద్రి రమేష్‌ను తప్పించి బాలశౌరికి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుతో కృష్ణాజిల్లా వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. మరి ఈ ముసలం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Similar News