టీటీడీలో నగల సెగల వెనుక అసలు కథ ఇది?

Update: 2018-05-23 05:25 GMT

టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు స్వామి వారి ఆభరణాలన్నీ ఉన్నాయా? లేవా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రమణదీక్షితులు కామెంట్లపై టీటీడీ అధికారులు, ప్రజాప్రతినిధులు వరుసగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఏదో జరిగి ఉంటుందంటున్నారు. టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వామి వారి ఆభరణాలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆభరణాలన్నీ బయట పెట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దేవుడి విషయంలో రాజకీయం చేయడం తగదని పలువురు భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా...ఆలయం పవిత్రతను టీడీపీ అపవిత్రం చేస్తోందని బీజేపీ మండిపడుతోంది. 

మరోవైపు అనేక ఆరోపణలు కలిగిన వ్యక్తులను టీటీడీ చైర్మన్‌గా నియమించారని, టీటీడీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. వైఎస్సార్‌ హయాంలో ధార్మిక మండలిని ఏర్పాటు చేశారని.. అయితే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి బాబు సర్కారు అవినీతికి పాల్పడుతోందంటూ ఆయన ఆరోపించారు.

స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని.. అయితే ఆయనే స్వయంగా వాటిని చూశారా? లేదా ఇలా చెప్పడంలో ఆయనపై ఎవరి ప్రభావమైనా ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. బెల్జియంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం వివరణ కోరాల్సిన అవసరముం‍దని వ్యాఖ్యానించారు. శ్రీవారి ఆలయంలో రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు భక్తులు.

మొత్తానికి స్వామివారి ఆభరణాల వ్యవహారంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలు పెద్ద దుమారాన్ని రేపాయి. మరి ఆభరణాలన్నీ ఉన్నాయో, లేదో లెక్క తేల్చాల్సిన అవసరం టీటీడీ బోర్డు పైనా, అధికారులపైనా ఉంది. 

Similar News