తిరుమలపై కేంద్రం కన్నేసిందా...? పర్యవసానాలు ఏంటి?

Update: 2018-05-05 11:44 GMT

టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిదిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాలంటిని రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ లేఖ పంపింది.
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదుల వస్తున్నాయట. పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోలేదని పురావస్తు శాఖ చెబుతోంది. త్వరలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది. 

Similar News