శివలింగంపై ప్రాణాలు విడిచిన పూజారి

Update: 2018-06-15 08:44 GMT

శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.. రుద్రుని ఆనతి లేకుండా కాలుడైనా కబళించడంటారు.. మరి ఆ శివయ్యే ఆనతినిచ్చాడో... తన దగ్గరకు రమ్మని ఆజ్ఞాపించాడో తెలియదు కానీ.. ఓ పూజారి శివ సన్నిధిలోనే కుప్పకూలిపోయాడు.. తాను నిత్యం పూజించే పరమేశ్వరుడి పాదాల ముందే ఒరిగిపోయాడు.

నిత్యం పంచాక్షరి జపించే హృదయం.. శివార్చనే లోకం.. శివ సన్నిధే పరమావధి అనుకునే జీవనం.. అలాంటి శివసన్నిధిలో ఓ పూజారి మోక్షం పొందాడు.. తనువు చాలించే వరకూ పరమేశ్వరుని సేవలోనే తరించాడు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రమైన సోమేశ్వర ఆలయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. స్వామివారికి పూజలు నిర్వహిస్తుండగా అర్చకుడు రామారావుకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో శివాలయంలోనే కుప్పకూలిపోయారు.. తోటి పూజారులు, కొడుకు, భక్తులు అందరూ చూస్తుండగానే ఒరిగిపోయారు.. సహ అర్చకులు అక్కడికి చేరుకొని రామారావు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.

ఆలయంలో ఎవరైనా మృతి చెందితే.. శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ వంటి క్రతువు చేయాలి. అయితే పూజారి రామారావుకు గుండెపోటు వచ్చిన వెంటనే బయటకు తీసుకొచ్చామని.. ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందారని ఆలయ ఈవో, పూజారులు చెబుతున్నారు. అయితే పూజారి ఆలయంలోనే మృతి చెందాడని భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది కేవలం  తప్పుడు ప్రచారమేనంటున్నారు అధికారులు. భీమవరం సోమేశ్వరాలయంలో పూజారి మృతిపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు ఏపీ దేవాదాయశాఖ స్పందించింది. అసలు సోమేశ్వరాలయంలో ఏం జరిగిందంటూ ఈఓను.. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ వివరణ కోరారు.

Similar News