జనసేన ఆపరేషన్ ఆకర్ష్ షురూ..జేసీకి జనసేన ఆహ్వానం..?

Update: 2018-04-12 06:17 GMT

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని చాలా కాలం కిందటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఒకసారి జిల్లాలో పర్యటించిన పీకే.. మరోసారి అనంతలో టూర్‌కి సన్నాహాలు చేస్తున్నారు. తన పోరాటాలకు కేంద్రంగా పవన్ అనంతపురం జిల్లాను ఎంచుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ప్రారంభమై నాలుగేళ్లయినా ఏ ఒక్కరూ ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జనసేనలోని కీలకనేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పీకే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేది చెప్పలేదు. దీంతో అనంతపురం టౌన్ నుంచి పోటీ చేస్తారని, కాదు కదిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే పవన్ ఇంత వరకూ నియోజకవర్గం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ అనంతపురం జిల్లాపై మొదటి నుంచి పవన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జనవరిలో 3 రోజులు అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్.. కీలకమైన గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి  నియోజకవర్గాలు చుట్టేశారు. ఈ నెల 15, 16న మరోసారి అనంతలో 2 రోజులు టూర్‌కొస్తున్నారు. 

ఈ ప‌ర్యట‌న‌లో త‌న మ‌ద్దతుదారుల‌కు 2019 ఎన్నిక‌ల్లో పార్టీ బ‌లోపేతం అంశంపై ప‌వ‌న్ స్పష్టమైన దిశానిర్దేశం చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో మైనార్టీ, బ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో వారి స‌మ‌స్యలపై ప‌వ‌న్ దృష్టి పెట్టిన‌ట్లు తెలిసింది.

పార్టీ బలోపేతానికి ఇతర పార్టీల్లో తను ఎంపిక చేసిన నేతలకు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహ్వానాలు పంపుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బలమైన నేత జేసీ దివాక‌ర్ రెడ్డిని జ‌న‌సేన శ్రేణులు సంప్రదించిన‌ట్లు తెల‌ుస్తోంది. మరో వైపు జేసీ కుమారుడు జ‌న‌సేన‌కు మ‌ద్దతు తెలిపే అవ‌కాశం ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి తరచూ జిల్లాలో పర్యటిస్తూ ఓ వైపు పార్టీని బ‌లోపేతం చేస్తూనే మ‌రో వైపు  స‌మ‌ర్ధత‌ గ‌ల నేత‌ల‌కు ప‌వ‌న్ గేల‌మేస్తొన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాను చేసే పోరాటాల‌కు అనంత‌పురాన్ని ఎంపిక చేసుకున్నట్లు స‌మాచారం.

Similar News