హోదాపై కేంద్రం తీరుకు నిరసనగా ఏప్రిల్ 6న పవన్ పాదయాత్ర

Update: 2018-04-04 10:13 GMT

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చుకొనేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ రోజు విజయవాడలో జరిగిన సీపీఎం, సీపీఐ, జనసేన నేతల భేటీలో చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తొలుత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ..విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఏప్రిల్ 6న జాతీయ రహదారులు లేని చోట ముఖ్య కూడళ్లలో పాదయాత్రలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాయని పవన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆయన చెప్పారు. విజయవాడలో జరిగే పాదయాత్రలో పవన్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఇక సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ సమస్య జాతీయ సమస్యగా మారిందని చెప్పారు. అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలుంటే రాష్ట్రంలో మాట్లాడుకోవాలని.. ఢిల్లీలో పరస్పర ఆరోపణలు సరికాదన్నారు. సిగ్గులేకుండా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

Similar News