జగన్‌కు తాత బుద్ధులే వచ్చాయి

Update: 2018-05-29 10:44 GMT

వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎవరి మాట వినేవారుకాదని, ఆయనకు అన్నీ తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మూడోవ రోజు మహానాడులో జేసీ మాట్లాడుతూ...జగన్‌ తీరు పట్ల ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో బాధపడేవారు. ఎవరి మాటా వినని తత్వం జగన్‌ది. వైసీపీలో చేరాలని నాకు జగన్‌ రాయబారం పంపాడు. నీకు ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి నా వద్దకు వచ్చారు. కానీ జగన్‌ సంగతి తెలిసిన నేను దాన్ని తిరస్కరించాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయింది. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆస్తి. దాని వారసుడు కచ్చితంగా లోకేశే. చంద్రబాబు తర్వాత లోకేశ్‌ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? అని అన్నారు.

తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ.. 40 ఏళ్ల చరిత్రను జేసీ చెప్పుకొచ్చారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని ఆయన అన్నారు. స్కెచ్‌ వైఎస్‌ వేసేవారని, రాజారెడ్ది అమలు చేసేవారని జేసీ తెలిపారు. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో జగన్‌ దగ్గర రూ. వెయ్యి కోట్ల హార్డ్‌ క్యాష్‌ ఉందని జేసీ పేర్కొన్నారు. ఎప్పుడూ చంపాలని, కొయ్యాలి, నరకాలని మాట్లాడతారని, వాళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందని జేసీ వ్యాఖ్యానించారు.

Similar News