ఇదేనా కేసీఆర్ నీతి?

Update: 2017-12-22 06:20 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను చిన్నచూపు చూస్తున్నారా? అందువల్లనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పట్టించుకోవడం లేదా? తెలంగాణలోని కొందరు ఎస్సీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆ ఎస్సీ సామాజికవర్గం అన్నా ఆయనకు చాలా చిన్నచూపు ఉందన్న విమర్శలు కొందరు దళిత నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఆరోపణల్లో నిజానిజాలేమిటి? అవి వ్యక్తిగతమైన అభిప్రాయాలా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కామెంట్లా? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రతి చర్య కూడా ఓ చర్చకు దారి తీస్తోంది. కొన్నిసార్లు వివాదాలకు, మరి కొన్నిసార్లు సంచలనాలకు దారి తీస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగకు నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కేసీఆర్ కు దళితుల పట్ల ప్రేమ లేదంటూ పలువురు ఆ సామాజికవర్గ నాయకులు విమర్శిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేయించిన కేసీఆర్ వర్గీకరణ కోసం త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతానని కూడా ప్రకటించారు. అది ఇంతవరకూ జరగకపోవడంతో మందకృష్ణ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసీఆర్ కు ఎస్సీల విషయంలో చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. అంతేకాదు జైల్లో ఉన్న మందకృష్ణను పలువురు నేతలు పరామర్శించి ఆయన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. వారిలో టీ-జాక్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఉన్నారు. అటు టీ-టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కూడా కేసీఆర్ వైఖరి మీద తీవ్రమైన కామెంట్లే చేశారు. 


టీ-టీడీపీ మాత్రమే కాదు టీ-కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ శైలి మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినమ్రంగా పాదనమస్కారం చేసిన కేసీఆర్ అదే స్థాయి వ్యక్తి రాంనాథ్ కోవింద్ వచ్చినప్పుడు మాత్రం అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇది దళిత జాతిని అవమానించడం కాదా అంటూ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు ఇదే విషయంలో సామాజిక తెలంగాణ అధ్యక్షుడు కిరణ్ అభిప్రాయం మరోలా ఉంది. కేసీఆర్ ఉద్దేశాల గురించి తమకు అవసరం లేదన్న కిరణ్ ఎస్సీ వర్గీకరణలో కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. వర్గీకరణలో అసలు చిత్తశుద్ధి లేని వ్యక్తి మంద కృష్ణ మాదిగేనని ఆరోపించారు. 

ఇక పాదాలకు నమస్కరించడం అనేది వ్యక్తిని బట్టి వ్యక్తికి ఉంటుందే కానీ సామాజిక వర్గాన్ని బట్టి మారే సంస్కారంగా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఉదాహరణగా ఉద్యమ సమయంలో జరిగిన అనేక బహిరంగ సభల్లో ప్రొఫెసర్ జయశంకర్ కు కేసీఆర్ అనేకసార్లు మోకరిల్లడం గమనించాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజికవర్గానికి ఉపయోగపడే సంగతులు వదిలేసి.. ఇలాంటి తేలికపాటి అంశాలను లేవనెత్తడం భావ్యం కాదన్న సూచనలు కూడా వినిపిస్తున్నాయి. 

Similar News